బిజెపి కి ఏపీలో ఒక్క ఓటు కూడా పడదని తెలిసినా బిజెపి వారి దింపుడు కళ్లెం ఆశలు ఆగడం లేదు. నిన్నటి వరకు టిడిపిని విమర్శించే బాధ్యతను ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీసుకున్నాడు. ఆ తర్వాత ఏపీ రాష్ట్ర బిజెపి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన ఒకప్పటి కాంగ్రెస్ నేత కన్నాలక్ష్మీనారాయణ చంద్రబాబుది కాంగ్రెస్‌కి అద్దె మైకు అని విమర్శించాడు. ఇప్పుడు ఈ కోవలోకి మరో నాయకుడు ఎంటర్ అయి వారి బాధ్యతలను తాను తీసుకున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ఏపీకి చెందిన కంభంపాటి హరిబాబు నుంచి కామినేని శ్రీనివాస్ వరకు అందరు మౌనంగా ఉంటూ ఉన్నా కూడా కేవలం తనకు రాజ్యసభ పదవి ఇచ్చింది బాబుపై, టిడిపిపై విమర్శలు గుప్పించడానికే అన్నట్లుగా జీవిఎల్ నరసింహారావు ధోరణి ఉంది. ఆయన కూడా తన బాధ్యత నెరవేరుస్తూ రోజుకో ప్రెస్‌మీట్ పెట్టి చంద్రబాబుని నిశితంగా విమర్శిస్తున్నాడు.
తాజాగా ఆయన చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. అమరావతిలో అక్రమాలు జరిగాయని కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో వెల్లడి అయిందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అభద్రతా భావంతో బిజెపి నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తోందన్నారు. వాటికి సంబంధించిన ఆధారాలు మా వద్ద ఉన్నాయి. ఎయిర్ ఏషియా కుంభకోణంలో బయటికి వచ్చిన ఫోన్ సంభాషణలు సీబిఐ, ఈడీ దర్యాప్తుల్లో భాగం అయ్యే అవకాశం ఉందని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్రంలో వెనుకబడిన ఏడు జిల్లాల సహాయం కోసం కేంద్రం ఇచ్చిన ధనాన్ని దుర్వినియోగం చేశారని, వాటిని సక్రమంగా వినియోగించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. చేయని పనులను చేసినట్లు చూపించారని, కేంద్రానికి ఇప్పటికే పలు ఫిర్యాదులు అందాయని ఆయన ఆరోపించారు. ఇక జగన్ అవినీతిని తాము అధికారంలోకి వస్తే స్వాధీనం చేసుకుంటామని గత ఎన్నికల సమయంలో టిడిపి ప్రకటించింది. టిడిపి నాయకులు తమ నోటికి వచ్చిన సంఖ్యని చెప్పి జగన్ దోచుకున్నాడని అంటున్నారు. ఒకరు లక్షకోట్లు అంటే మరొకరు 25 కోట్లు అంటారు. కానీ నాలుగేళ్లయినా జగన్ అవినీతిని రాష్ట్రం ఏమాత్రం వెలికి తీసిందో అర్ధమవుతోంది.
ఇక జగన్ కాంగ్రెస్ నుంచి విడిపోయిన తర్వాత మాజీ జేడీ లక్ష్మీనారాయణతో కాంగ్రెస్ నానా హంగామా చేయించింది. అది కూడా అలాగే ఉండిపోయింది. ఇక టిడిపి-బిజెపిలు కలిసి ఉన్నప్పుడు కూడా వైసీపీ అధినేత జగన్‌పై బిజెపి నాయకులు అవినీతి ఆరోపణలు చేశారు. కానీ ఇవన్నీ కేవలం మాటలకే గానీ చేతల్లో వీలుకాదని తేలిపోయింది. గాలి జనార్ధన్‌రెడ్డి నుంచి జగన్ వరకు హాయిగా బయట తిరుగుతున్నారు. మరి కేంద్రంలో ఇప్పుడు బిజెపికి పూర్తి మెజార్టీ ఉంది. మరి అధికారం వారి చేతుల్లో ఉన్నప్పుడు చంద్రబాబు తప్పులని వెలికి తీసి బిజెపి ఆయనకు శిక్ష ఎందుకు విధించదు? కేవలం మాటలు కాకుండా చేతల్లో ఎందుకు చూపించడం లేదనేది అసలు ప్రశ్న.