సావిత్రి బయోపిక్‌గా 'మహానటి' చిత్రం మే9వ తేదీన విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలైన 26రోజుల్లో 26కోట్ల రూపాయల షేర్‌ని సాధించడం లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో ఓ రికార్డు అనే చెప్పాలి. ఈ చిత్రంలో సావిత్రి దీనస్థితి, ఆమె మరణం నుంచి అన్నింటినీ దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుతంగా చిత్రీకరించిన తీరు, కీర్తిసురేష్ నుంచి సమంత, దుల్కర్ సల్మాన్, సమంత, విజయదేవరకొండ వంటి నటీనటుల అద్భుత నటన కూడా ఈ చిత్రం విజయానికి కారణం. మరో ముఖ్య విషయం ఏమిటంటే.. 'మహానటి' తర్వాత దానికి పోటీనిచ్చే చిత్రం ఏదీ విడుదల కాకపోవడం కూడా ఈ చిత్రానికి ప్లస్ పాయింట్‌గా చెప్పాలి. ఈ చిత్రం యూనిట్‌ని ఆల్‌రెడీ మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్‌లు సత్కరించారు.
బిజీగా ఉండటం వల్ల ఇంత కాలం ఈ చిత్రాన్ని చూడలేకపోయిన రామ్‌చరణ్ తాజాగా ఈ చిత్రం చూసి సినిమాని ప్రశంసల వర్షంలో ముంచెత్తాడు. 'మహానటి' చిత్రం నా మనసును తాకిన చిత్రం. ఈ చిత్రం ఇంత అద్భుతంగా ఉండటానికి నాగ్ అశ్విన్ ప్రతిభ కారణం. ఇక ఈ చిత్రంలో నటించిన అందరు అద్భుతంగా నటించారని తెలిపాడు. ఇక 'మహానటి' చిత్రం విడుదలైనప్పటి నుంచి సావిత్రికి చెందిన పలు విషయాలను తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. సావిత్రి జెమిని గణేషన్‌ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటికే జెమినికి రెండు వివాహాలు జరిగాయి. పిల్లలు కూడా ఉన్నారు. సావిత్రిని వివాహం చేసుకున్న తర్వాత వారి సంసార జీవితం కొంత కాలం అన్నోన్యంగా సాగింది. తర్వాత విభేధాలు వచ్చాయి.
ఇక సావిత్రి తన భర్తని ఇతరులు వద్ద ప్రస్తావించే సమయంలో 'జెమిని గణేషన్ అయ్యర్'లోని అయ్యర్ అని పిలిచేది. ఇక ఈమె తన భర్తని నేరుగా 'ఎన్నాంగో' అని అనేది. ఈ మాటకి అర్ధం 'ఏవండీ' అని. సావిత్రి మంచితనం, ఎంతో గౌరవంగా పిలిచే మాటతీరు మనకి తెలుసు. ఇలా తన భర్తపై ఉన్న ప్రేమను సావిత్రి ఈ రెండు పేర్లద్వారా చాటుకుందనే చెప్పాలి.