గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికార, విపక్షాల మధ్య భూకబ్జాల విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వైజాగ్‌లో జరిగిన భూ కుంభకోణం సంచలనంగా మారింది. దీనిపై అధికార టిడిపి, ప్రతిపక్ష వైసీపీలేకాదు.. బిజెపి, జనసేన వంటివి కూడా ఒకరిపై ఒకరు విమర్శలను సంధిస్తూ ఉన్నారు. ఎక్కడ ఖాళీ భూమి ఉంటే అక్కడ కబ్జారాయుళ్లు ఆయా భూములను సొంతం చేసుకుని, ఆయా స్థలాల హక్కుదారులను భయపెట్టి, కిడ్నాప్‌లు, చంపుతామంటూ బెదిరింపులు చేస్తూ అరాచకం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా ఖాళీగా వదిలేసిన భూముల విషయంలోనే ఇలా ఎక్కువగా జరుగుతోంది.
ఇక విషయానికి వస్తే టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, వ్యాంపు తరహా పాత్రలు చేసే నటి అపూర్వ. ఈమెకి పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇటీవలే ఈ స్థలాన్ని సర్వేయర్‌తో సర్వే చేయించి హద్దు రాళ్లు కూడా నాటించాను. మరుసటి రోజే ఆ పక్కన ఉన్న రైతులు సరిహద్దు రాళ్లను తొలగించి ఆ భూమిని కబ్జా చేశారు. ఈ కబ్జా గురించి పోలీసులు మాట్లాడుతూ, ఇది సివిల్ వ్యవహారం. భూమి సరిహద్దు వివాదాన్ని ఎమ్మార్వో చూసుకుంటారు. రెవిన్యూ అధికారులతో చర్చించి, సమస్యను పరిష్కరిస్తామని అంటున్నారు. సరిహద్దు రాళ్లను తొలగిండచమే కాదు..తనని తిడుతూ, బెదిరిస్తున్నారని అపూర్వ అంటోంది.
మరో విశేషం ఏమిటంటే.. తనకు న్యాయం జరగకపోతే దీని వెనుక ఉన్న రహస్యాలన్నింటినీ బయట పెడతానని అపూర్వ అంటోంది. దీంతో దీని వెనుక పలు పెద్దల హస్తం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఓ ప్రముఖ సినీ నటి స్థలమే కబ్జాకు గురికావడం స్థానికంగా సంచలనంగా మారింది.