రజినీకాంత్ నటించిన కాలా సినిమా గురువారం అంటే జూన్ 7 నే ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతుంది. అయితే అన్నిచోట్లా కాలాకి అనుకూలంగా ఉంటే కన్నడనాట మాత్రం కాలాకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతుండడంతో.. 'కాలా' డైరెక్టర్ రంజిత్ పా కి కాలా నిర్మాత ధనుష్ కి కంటిమీద కునుకులేదు. కావేరీ నదీ జలాలపై రజనీకాంత్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆయన నటించిన కాలా సినిమాను అడ్డుకుంటామని కన్నడ అనుకూల సంఘాలు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. కర్ణాటకలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం కావేరీ నదీ జలాలపై సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని రజనీ లోగడ డిమాండ్ చేశారు.
అయితే అందులో భాగంగానే కర్ణాటకలో కాలా సినిమాని విడుదల కాకుండా ఆపేయాలని.. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి కుమార స్వామి కూడా భావిస్తుండగా.... కర్ణాటక హైకోర్టు కాలా విడుదల కాకుండా ఉండేందుకు స్టే ఇవ్వమని.. కాలా సినిమాని విడుదల ఆపరాదని.. అలాగే విడుదల కూడా అడ్డుకోకుండా.. ప్రశాంతంగా సినిమా విడుదలకు కావాల్సిన భద్రతా ఏర్పాట్లను కర్ణాటక గవర్నమెంట్ కల్పించాలని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. ఇక ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా కాలాకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
కాలా విడుదలను నిలిపివేయాలంటూ వచ్చిన పిటిషన్ ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రేక్షకులంతా కాలా సినిమా విడుదల కోసం ఉత్కంఠతతో వేచి చూస్తున్నారు. విడుదల విషయంలో మేం జోక్యం చేసుకోవాలని అనుకోవడం లేదు.. అంటూ తన తీర్పుని వెల్లడించింది. ఇక సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ - హ్యూమా ఖురేషి ల కాలా సినిమా రేపు గురువారం ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందు సందడి చేయబోతుంది. ఇక కన్నడనాట కూడా కర్ణాటక సీఎం కుమార స్వామి కర్ణాటక హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేస్తామని ప్రకటించారు.