'కబాలి' చిత్రం తర్వాత వస్తోన్న 'కాలా' చిత్రం కోసం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించి రజనీకాంత్ తన ప్రసంగం అంతా తెలుగులోనే చేసినా ఈ చిత్రంపై ప్రీ రిలీజ్ బజ్ ఏర్పడలేదు. ఈ చిత్రాన్ని కొనేవారు లేకపోవడంతో లైకాప్రొడక్షన్స్ సంస్థ దిల్‌రాజు, ఎన్వీప్రసాద్‌లను ఈ చిత్రం విడుదలయ్యే బాధ్యతలు చూడమని, కష్టనష్టాలకు తామే బాధ్యత తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు విడుదలకు సిద్దమవుతున్నారు. ఇక రజనీ కెరీర్‌లోనే ఏమాత్రం బజ్ లేకుండా విడుదల అవుతున్న చిత్రం 'కాలా'నే. దీనిని కొందరు 'కొచ్చాడయాన్'తో పోలుస్తున్నారు. ఆన్‌లైన్ టిక్కెట్ల బుకింగ్‌లు కూడా ఊపుగా లేవు.
ఇదే సమయంలో 'కాలా' చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయమంటూ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. కావేరినదీ జలాల విషయంలో తమిళనాడుకు అనుకూలంగా రజనీ మాట్లాడటమే దీనికి కారణంగా చెప్పాలి. దీంతో ఈ చిత్రం యూనిట్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్‌ని పరిశీలించిన కర్ణాటక హైకోర్టు ఈ చిత్రం విడుదలతో తాము జోక్యం కల్పించుకోలేమని, సినిమా ప్రదర్శనలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఆ సినిమా విడుదల అవుతున్న థియేటర్ల లిస్ట్‌ని సినిమా యూనిట్ రాష్ట్ర ప్రభుత్వానికే అందజేయాలని 'కాలా' న్యాయవాదులకు తెలిపింది.
ఇక ఈ విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించాడు. ఓ ముఖ్యమంత్రిగా హైకోర్టు ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత నాపై ఉంది. అయినా ఇలాంటి పరిస్థితుల్లో 'కాలా' చిత్రాన్ని విడుదల చేయడం సరికాదు. ముఖ్యమంత్రిగా కాకుండా ఓ సాధారణవ్యక్తిగా, కన్నడిగునిగా నేను మాట్లాడుతున్నాను..అని తెలిపాడు. సో.. 'కాలా' చిత్రం కర్ణాటకలో విడుదలయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.