తెలుగులో మహిళలు శపథం చేసే పాయింట్‌తో 'మంగమ్మ శపథం', ఇక మహాభారతంలో ద్రౌపది కౌరవుల అంతు చూసేదాక జట్టును ముడి వేసుకోనని చేసిన శపథం వంటివి పలు ఉదాహరణలున్నాయి. ఇక నిండు అసెంబ్లీలో తన చీరను లాగాలని చూసిన డీఎంకే పై పట్టుబట్టి జయలలిత సీఎం అయిన తర్వాత కరుణానిధి వంటి కురు వృద్దుడుని జైలుకు పంపించింది. ఇప్పుడు ఇలాంటి శపథమే స్వర్గీయ ఎన్టీఆర్ రెండో భార్య అయిన లక్ష్మీపార్వతి చేయడం ఆసక్తికరంగా మారింది.
ఆమె తాజాగా మాట్లాడుతూ.. 'చంద్రబాబు పాపాలు పండాయి. ఆయన పాపాలే ఆయనను కబళించి వేస్తాయని ఈ వైసీపీనాయకురాలు ఘంటాపథంగా చెబుతోంది. చంద్రబాబు చేసిన తప్పులే ఆయన్ను చుట్టుముడుతున్నాయి. ఎన్టీఆర్‌కి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు, ఎన్టీఆర్‌ని చూసి ఓట్లేసిన ఉభయరాష్ట్రాల ప్రజలకు నీవు చేసిన ద్రోహానికి ఫలితం అనుభవించబోతున్నావు. నీ పతనాన్ని నేను కళ్లారా చూస్తాను. ఆరోజునే నా భర్త ఎన్టీఆర్ అస్థికలను గంగా, కావేరి నదుల్లో కలుపుతాను అని చెప్పుకొచ్చింది. అయినా లక్ష్మీపార్వతికి అంత సీన్ ఉందా? అన్నదే అసలు పాయింట్.
ఎందుకంటే ఎన్టీఆర్ రెండో భార్యగా ఆమెకి ప్రజల్లో సరైన గుర్తింపు లేదు. ఆమెతో పరిచయం ఉన్న పలువురు లక్ష్మీపార్వతి తెలుగుదేశం పార్టీని కబ్జాచేయాలని భావించిందని, అదే చంద్రబాబు ఆ స్థానాన్ని ఎన్టీఆర్ నుంచి తనచేతుల్లోకి తీసుకోకుండా ఉండి ఉంటే తెలుగుదేశం పార్టీ అసలు నేడు ఉనికిలో ఉండేదే కాదని అంటున్నారు. గతంలో తమిళనాడులో ఎంజీఆర్ మొదటి భార్యగా గుర్తింపు పొందిన జానకీ రామచంద్రన్‌కి పట్టిన గతే లక్ష్మీపార్వతికి ఎదురవుతుందని టిడిపినాయకులు మండిపడుతున్నారు.
మరోవైపు లక్ష్మీపార్వతికి అనుకూలంగా ఎన్టీఆర్ జీవితంలోకి ఆమె వచ్చినప్పటి నుంచి జరిగిన పరిణామాలను చూపిస్తూ రాంగోపాల్‌వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే చిత్రం తీస్తానని చెప్పాడు. కానీ 'ఆఫీసర్' ఇచ్చిన షాక్‌తో రాంగోపాల్‌వర్మ ఇప్పుడు అంత రిస్క్ చేస్తాడా? అయనలో ఆ సత్తా ఉందా? అనేది మాత్రం అనుమానమే.