కొత్త దర్శకులకు మొదటి చిత్రం హిట్టయింది అంటే ఇక రెండో చిత్రాన్ని ద్వితీయ విఘ్నంగా భావించి సెంటిమెంట్ పరంగా సినిమా ప్రారంభానికి ముందే ఫ్లాప్ కిందకి తెస్తారు. ద్వితీయ విఘ్నంను కూడా దాటేస్తే ఆ తర్వాత వచ్చే హ్యాట్రిక్ మూవీ ఆడదని అంటారు. కానీ ఇలా అనుకున్న వారిసెంటిమెంట్లు అన్నింటిని తప్పు అని ప్రూవ్ చేసిన వారిలో రాజమౌళి, కొరటాల శివల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా కొరటాల శివ ఇప్పటి వరకు తాను ఏ హీరోతో చిత్రం చేస్తే ఆయా స్టార్స్‌కి ఇండస్ట్రీ హిట్‌లని అందించాడు. మురుగదాస్, శంకర్‌ల తరహాలో ఒక సందేశానికి కమర్షియల్ టచ్ ఇచ్చి ప్రజల్లోకి ఆ సందేశం సూటిగా వెళ్లేలా చేయడంలో కొరటాల శివ ప్రస్తుతం అందరినీ మించిపోయాడు.
రాజమౌళి అయినా సమాజం మంచికోసమని సినిమాలు తీయకుండా, సందేశాలు కాదు.. ఎంటర్‌టైన్‌మెంటే తన లక్ష్యమని భావిస్తాడు. కానీ కొరటాల శివ అలా కాదు. ఇక కొరటాల ప్రస్తుతం 'భరత్ అనే నేను' సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ చిత్రం విడుదలైన తర్వాత రెండు నెలల పాటు రెస్ట్ తీసుకుంటానని తర్వాత కొత్త చిత్రం ప్రారంభిస్తానని చెప్పాడు. మొదట ఈయన లిస్ట్‌లో అల్లుఅర్జున్, రామ్‌చరణ్, అఖిల్, నాని వంటి వారు ఉన్నారు. కానీ ఆయన ఏకంగా మెగాస్టార్ చిరంజీవికే స్టోరీలైన్ చెప్పి ఓకే చేయించుకున్నాడట.
ఇక ఈ చిత్రంలో మెగాస్టార్‌చిరంజీవి ఓ బడా మిలియనీర్ ఎన్‌ఆర్‌ఐగా, మరో పాత్రలో సాధారణ రైతు పాత్రలను పోషించనున్నాడని సమాచారం. చిరంజీవి దశాబ్దం ముందు 'అందరివాడు'లో తండ్రీ కొడుకులుగా నటించాడు. దశాబ్దం గ్యాప్ తర్వాత 'ఖైదీనెంబర్ 150'లో కూడా ఆయన అలాగే కనిపించాడు. మరి కొరటాల సినిమా విషయంలో చిరు డ్యూయెల్ రోల్ పాత్ర అనే సమాచారం నిజమో కాదో వేచిచూడాల్సివుంది...!