ప్రస్తుతం రజనీకాంత్, కమల్‌హాసన్ ఇద్దరు రాజకీయాలలోకి వచ్చారు. వారు నేడు సినిమాల కంటే తమిళ ప్రజల తరపున మాట్లాడటానికి, తమిళ సమస్యలపై గళమెత్తేందుకు నిర్ణయించుకున్నారు. కావేరి జలాల వివాదం అనేది ఎన్నో ఏళ్ల నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మద్య చిచ్చుపెడుతోన్న అంశం. దీనిపై మాట్లాడకపోతే తమిళ ప్రజల ఆగ్రహానికి గురికావడం ఖాయం. అందుకే తమ రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని రజనీకాంత్, కమల్‌హాసన్‌లు కావేరి జలాల విషయంలో కర్ణాటక తీరుని తప్పుపడుతూ, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తమిళనాడుకి జలాలు విడుదల కావాల్సిందేనని బహిరంగంగానే మాట్లాడుతున్నారు.
తమిళనాడులో ఓట్లు పడాలంటే ఇది తప్పదు. కానీ కరవమంటే కప్పకు కోపం..విడవమంటే పాముకి కోపం అన్నచందంగా మాట్లాడకపోతే తమిళ ప్రజల ఆగ్రహం, మాట్లాడితే కన్నడిగుల ఆందోళన అని తెలిసినా ఈ విషయంలో తమిళనాడు తరపునే రజనీ నిలబడ్డాడు. దాంతో ఆయనంటే మండిపడుతున్న కర్ణాటకకు చెందిన ప్రజా సంఘాలు, పరిరక్షణ సమితి నాయకులు జూన్ 7వ తేదీన విడుదల కానున్న రజనీకాంత్ 'కాలా'ని కర్ణాటకలో విడుదల కానివ్వమని అల్టిమేటం జారీచేశారు. ఈ విషయంలో వెంటనే స్పందించిన కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి రజనీకాంత్ 'కాలా' చిత్రాన్ని కర్ణాటకలో విడుదల కానివ్వమని చెప్పారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిట్యూటర్లు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు.
ఇక తాజాగా కర్ణాటక కన్నడ రక్షణ వేదిక అధ్యక్షుడు ప్రవీణ్‌శెట్టి మాట్లాడుతూ, రజనీకాంత్ కర్ణాటక ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పినా కూడా తాము 'కాలా'ని విడుదల చేయనిచ్చే పనేలేదని తేల్చిచెప్పాడు. కర్ణాటకకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న రజనీకాంత్, కమల్‌హాసన్ చిత్రాలను కర్ణాటకలో విడుదల కానివ్వబోమని, కానీ మిగిలిన తమిళ చిత్రాల విడుదలకు తాము సుముఖంగానే ఉన్నామని తేల్చిచెప్పాడు. ఈ విషయంపై స్పందించిన కుమారస్వామి మరోసారి వారితో మాట్లాడి తన నిర్ణయం తెలియజేస్తానని చెప్పారు. ఈ సమస్యకు కేవలం దక్షిణాది నదుల అనుసంధానం తప్పితే మరో పరిష్కారం లేదని చెప్పాలి.