చాలాకాలం నుంచి బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. 'దంగల్, భాగ్ మిల్కా భాగ్, మేరీకోమ్, ఎంఎస్ ధోని, అజార్, సచిన్' ఇలా ఎన్నో బయోపిక్స్ రూపొందుతున్నాయి. తాజాగా సంజయ్‌దత్ జీవితం ఆధారంగా 'సంజూ' చిత్రం రానుంది. ఈచిత్రంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఎవరి బయోపిక్ తీయాలన్నా అందులో సినిమాటిక్ అంశాలకు కొదువ లేకుండా ఉండాలి. సంజయ్‌దత్ జీవితం తీసుకుంటే తల్లి మరణం, డ్రగ్స్‌కి బానిస కావడం, అమ్మాయిలు, నటీమణులు, వేశ్యలతో లైంగిక విచ్చలవిడితనం, ఆ తర్వాత అక్రమాయుధాల కేసు, జైలు జీవితం, భార్యకి విడాకులు వంటి ఎన్నో మసాలాలు ఉన్నాయి.
ఇక 'మహానటి' విషయంలో రాబోయే ఎన్టీఆర్ జీవితంలో రాజశేఖర్‌రెడ్డి కెరీర్‌లో కూడా ఒడిదుడుకులు ఎత్తు పల్లాలు, వాద వివాదాలు ఉన్నాయి. కానీ ఏయన్నార్‌ది మాత్రం సంపూర్ణ జీవితం. ఆయన కెరీర్, వ్యక్తిగత జీవితం కూడా ఎంతో సాదాసీదాగా ఫ్లాట్‌గా, ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండా ముగిసింది. ఇక విషయానికి వస్తే తాజాగా చాలామంది త్వరలో ఏయన్నార్ బయోపిక్ రానుందని ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై ఆయన తనయుడు నాగార్జున స్పందించారు.
ఏయన్నార్ బయోపిక్ తీద్దామని గతంలో కొందరు నన్ను కలిశారు. కానీ నాన్నది అందమైన జీవితం. సాదాసీదాగా ఉండే ఆయన జీవితంతో బయోపిక్ తీస్తే చూస్తారా? సినిమా అందరికీ నచ్చుతుందా? మన వాళ్లకి బాగా వివాదాలు, నెగటివిటీ ఉండాలి. అవి లేకపోతే ఇక్కడ సినిమాలు ఆడవు. కెరీర్‌లో ఎత్తుపల్లాలు, వివాదాలు, ఒడిదుడుకులు ఆయన జీవితంలో లేవు. నాన్న జీవితాన్ని పుస్తకంగా తెస్తే బాగుంటుందని నా ఉద్దేశ్యం అని చెప్పుకొచ్చారు.