ఒకటి రెండేళ్ల కిందట కేంద్రంలో ఉన్న బిజెపి, ప్రధాని మోదీకి తిరుగేలేదని ఆయన మరలా వచ్చేసారి కూడా ప్రధానమంత్రి అవుతారనే అభిప్రాయం దేశంలోని మెజార్టీ ప్రజల్లో ఉంది. కానీ పెద్దనోట్ల రద్దు, బ్యాంకులను దివాలా తీయించి, బ్యాంకులపై నమ్మకం పోగొట్టే నిర్ణయాలు, నీరవ్‌మోదీ వంటి వారి బ్యాంకు కుంభకోణాలతోపాటు అద్వానీ వంటి కురువృద్దుడిని అవమానించడంతో దేశంలోని ప్రజలు మోదీ అంటే మండిపడుతున్నారు. ఇక దక్షిణాదిన చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఉత్తర భారతంలో జరిగిన ఉప ఎన్నికలలో సిట్టింగ్ స్థానాలతో పాటు కర్ణాటకలో కూడా చుక్కెదురైంది. ఇక నేడు ఏపీ విషయానికి వస్తే ఒకవైపు వైసీపీ అధినేత జగన్, మరోవైపు జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్‌లు పర్యటనలు చేస్తూ చంద్రబాబుపై మండిపడుతున్నారు.
మరోవైపు మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ కూడా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ ముగ్గురు బిజెపి అధిష్టానం కనుసన్నలలో నడుస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అదే జరిగి వీరిలో ఎవరైనా సరే ఏపీలో బిజెపితో పొత్తు పెట్టుకుంటే ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. ఒకవైపు జగన్, మరోవైపు జేడీ అంటే అది కుదరని పని. ఇక తాను బిజెపిలో చేరుతున్నానని, బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్ధి తనేనని వస్తున్న వార్తలను జేడీ లక్ష్మీనారాయణ ఖండించారు.
ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, రాష్ట్రపర్యటన పూర్తి అయిన తర్వాత దానిపై క్లారిటీ ఇస్తానని చెప్పాడు. గతంలో ఈయన తనకు వ్యవసాయ మంత్రిగా చేయాలని ఉందని తెలిపాడు. ఇటీవల ఆయన ఆరెస్సెస్ సభకు కూడా వెళ్లడంతో ఆయన బిజెపిలో చేరుతాడనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి వైసీపీ, జనసేన, జెడీ లక్ష్మీనారాయణలు బిజెపితో కలిసి పనిచేయకపోతేనే వారికి ఏపీలో మనుగడ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు తేలుస్తున్నారు....!