కుక్కలు, గుర్రాలు, ఏనుగులు, పులుల కథలతోనే కాదు ఎలుకలు, ఈగలతో కూడా వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కొత్తదనంతో అలరించి ఘనవిజయాలు సాధించిన దాఖలాలు ఉన్నాయి. ఇక విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు పందిపిల్లను ప్రధాన పాత్రలో తీసుకుని 'అదిగో' అనే చిత్రం తీశాడు. వాస్తవానికి ఈ చిత్రం షూటింగ్ పూర్తయి ఎంతో కాలం అయింది. రవిబాబు ఈ చిత్రం ప్రమోషన్ కోసం పందిపిల్లను చేతిలో పట్టుకుని ముద్దాడుతూ ఏటీఎం సెంటర్ల వద్ద, ఓట్లు వేసే సందర్భంగా కూడా పందిపిల్లతో కనిపించాడు. ఇక ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్‌తో పాటు ఫ్లయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.
ఇక తాజాగా దర్శకనిర్మాత రవిబాబు ఈ తెల్లని పందిపిల్లని బుజ్జగిస్తూ, దాని పళ్లు తోముతున్న వీడియోను విడుదల చేశాడు. దీనిని రవిబాబు తండ్రి నటుడు చలపతిరావు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఈ సినిమా అందరినీ నవ్విస్తుంది. మీ ఆశీర్వాదాలు ఈ చిత్రానికి ఉంటాయి. ప్రతి సినిమాకు ప్రేక్షకుల ఆశీస్సులు ఉండబట్టే బాగా ఆడుతున్నాయి. ప్రేక్షక దేవుళ్లకు మరోసారి నమస్కారాలు తెలుపుతున్నాను. ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి.. అని చలపతిరావు విజ్ఞప్తి చేశాడు. ఇక విభిన్న కథాంశాలతో ప్రయోగాలు చేస్తూ నవ్విస్తూనే నవరసాలను పండించే రవిబాబు తీసిన ఈ చిత్రం ఎప్పుడు వస్తుందో వేచిచూడాల్సివుంది.
ఒకప్పటి కంటే ఇప్పుడు విభిన్న చిత్రాల ఆదరణ బాగా ఉన్న నేపధ్యంలో ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో వేచిచూడాల్సివుంది. మరోవైపు గబ్బిలాలు. పందుల వల్ల నిపా వైరస్ వస్తోందని దేశమొత్తం టెన్షన్ పడుతున్న నేపధ్యంలో రవిబాబు భలేగా ప్రమోషన్ చేస్తూ, పైసా ఖర్చు లేకుండానే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడని చెప్పవచ్చు.