సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య గురించి అందరికీ తెలుసు. ఆమె రజనీకాంత్ నటించిన 'కొచ్చాడయాన్', తర్వాత ధనుష్ హీరోగా అమలాపాల్, కాజోల్‌లతో 'విఐపి 2' చిత్రాలకు దర్శకత్వం వహించింది. ఈ రెండు చిత్రాలు పలు భాషల్లో విడుదలైనప్పటికీ ఎక్కడా విజయం సాధించలేదు. ఇక ఈమె గ్రాఫిక్స్ డిజైనర్ కూడా. తాజాగా ఆమె ఖచ్చితంగా ఏడేళ్ల కిందట జరిగిన ఓ చేదు సంఘటనను గుర్తు చేసుకుంది.
ఏడేళ్ల కిందట ఖచ్చితంగా ఇదే రోజు మా నాన్న రజనీకాంత్‌కి తీవ్ర అనారోగ్యం కలిగింది. దాంతో ఆయనను సింగపూర్ తీసుకెళ్లాం. దేవుని దయ వలన ఆయన ఆరోగ్యవంతుడై కొన్నిరోజులకే మాతో కలిసి వచ్చారు. నాడు మీ ప్రార్ధనలకు కృతజ్ఞతలు. నేటితో ఈ ఘటనకు ఏడేళ్లు గడిచాయని సౌందర్య చెప్పుకొచ్చింది. మొత్తానికి నాడు మీడియా అంతా రజనీకి అనారోగ్యం అని చెప్పినా రజనీతో పాటు పలువురు దానిని ఓ పుకారుగా కొట్టిపారేశారు. కానీ ఏడేళ్ల తర్వాత ఆ సంఘటన గురించి తాజాగా సౌందర్య నోరు విప్పడంతో ఆ వార్తలు నిజమేనని నేడు ఓ క్లారిటీ వచ్చింది.
ఇక రజనీ నటించిన 'కాలా' చిత్రం వచ్చేనెల 7వ తేదీన విడుదల కానుండగా, '2.ఓ'ను ఆగస్టులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సన్ పిక్చర్స్‌ని నిర్మించే చిత్రం 'కాలా' చిత్రం విడుదల కాగానే ప్రారంభం కానుంది.