నిజంగానే 100చిత్రాలకు పైగా దర్శకత్వం వహించిన శతాధిక చిత్రాల డైరెక్టర్స్ కూడా తయారు చేయలేనంత మంది దర్శకులను వర్మ అతి తక్కువ కాలంలో తయారు చేశాడు. ఆయన తీసిన 'శివ' చిత్రం కంటే ముందు. తర్వాత అనే లెక్కతీసుకుంటే వర్మ ఇన్‌స్పిరేషన్‌గా దర్శకులుగా మారినవారు ఎందరో ఉన్నారు. ఎలాంటి సినీ నేపధ్యం, దర్వకత్వ విభాగంలో పనిచేయకుండా కూడా దర్శకులుగా సంచలనాలు సృష్టించవచ్చని వర్మ ప్రూవ్ చేశాడు. ఇక ఈయన శిష్యుల్లో పూరీ, తేజ, కృష్ణవంశీ, గుణశేఖర్ నుంచి జెడిచక్రవర్తి నుంచి తాజాగా 'ఆర్‌ఎక్స్ 100' తీస్తున్న దర్శకుల వరకు ఎందరో ఉన్నారు. అలాంటి వర్మ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈయన హైదరాబాద్, ముంబై, న్యూయార్క్‌లలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లను స్థాపించనున్నాడు. అది 'ఆర్జీవీ ఆన్ స్కూల్'. న్యూయార్క్‌కి చెందిన రామ్‌స్వరూప్, శ్వేతారెడ్డిల సహకారంతో వర్మ ఈ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ని స్థాపించనున్నాడు.
దీని గురించి ఆయన మాట్లాడుతూ, చాలామంది నన్ను సెల్యులాయిడ్ టెర్రరిస్ట్ అంటుంటారు. ఈ స్కూల్ ద్వారా ఇలాంటి వారినే తయారు చేసి వదులుతాను. చదువులో అన్ని తరగతులను రెండేసి సార్లు ఫెయిల్ అయిన నేను స్కూల్‌ని పెట్టడం విచిత్రమేనని చెప్పాలి. కొన్ని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నా కూడా వాటిల్లో పురాతన కాలంనాటి సినిమా తీసే పద్దతులను నేర్పిస్తున్నారు. ఇక నా స్కూల్‌లో మాత్రం తరగతులు, క్లాస్‌లు ఉండవు. మీలోని ప్రతిభను బయటకు తీయడమే మా పని. ఇక నా హిట్‌చిత్రాలను చూపి నేను ఎవ్వరికీ కోచింగ్ ఇవ్వను. ఫ్లాప్ అయిన చిత్రాల నుంచే ఎక్కువ నేర్చుకోవడానికి వీలుంటుంది. హిట్ సినిమాలను ఫలానా విధంగానే తీయాలని ఏమీ రూల్ లేదు. ఓ కథను పదిమంది దర్శకులకు ఇస్తే పది మంది పది విధాలుగా తీస్తారు. ఎవరి ఆలోచనా పరిది వారిది. ఆ ఆలోచనా పరిధిని విస్తరించేలా ఈ స్కూల్ ఉంటుంది.
ఇక ఈ ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించిన అడ్మిషన్లు ఇతర వివరాలను మరో 20రోజుల్లో చెబుతా. అని చెబుతున్న వర్మ ఎలాంటి దర్శకులను తయారు చేస్తాడో అనే ఆసక్తి అన్నిచోట్లా వ్యక్తమవుతోంది.