విప్లవ చిత్రాల నాయకుడు, కమిట్‌మెంట్ ఉన్న వామపక్ష వాది, విప్లవాత్మక చిత్రాల ద్వారా తెలుగు వెండితెరపై ఎర్ర చిత్రాలను ఎగురవేసిన మొదటి నటుడు, నిర్మాత మాదాల రంగారావు తాజాగా తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పార్ధివదేహాన్ని మెగాస్టార్ చిరంజీవి దర్శించుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ, మాదాల రంగారావు గారు నేను చెన్నైలో ఉన్నప్పటి నుంచి నాకు మంచి పరిచయం. నా కెరీర్ తొలినాళ్లలో ప్రోత్సహించిన వారిలో టి.కృష్ణ, మాదాల రంగారావులది ప్రత్యేక స్థానం.. ఎందుకంటే నేను ఒంగోలులో చదువుకుంటున్న నాటి నుంచి వారితో నాకు పరిచయం ఉంది. మనది ఒంగోలు..నువ్వు కష్టపడి ఎదిగి, ఒంగోలు ప్రతిష్టను పెంచాలి అని మాదాల రంగారావు నాతో చెబుతూ ఉండేవారు. ఆయన కమిట్‌మెంట్ ఉన్న చిత్రాలలోనే చేశారు గానీ కమర్షియల్ ఫార్ములా చిత్రాలలో అవకాశాలు వచ్చినా ఆయన చేయలేదు... అని తెలిపారు.
ఇక పవన్‌కళ్యాణ్.. మాదాల కుటుంబానికి సంతాపం తెలుపుతూ, 80లలో ఆయన చిత్రాలు అద్భుతంగా ఉండేవి. ఆయన చిత్రాలే కాదు.. అందులోని డైలాగ్స్, పాటలు కూడా ఎంతో ఆలోచించేవిగా ఉండేవి. అవినీతి, నాయకుల అణచివేత, నిరుద్యోగ యువత సమస్యలను ఆయన నాడే అద్భుతంగా చూపించారన్నారు. ఇక మాదాల తనయడు రవి మాట్లాడుతూ, కేవలం సినిమాలలోనే కాదు.. నిజజీవితంలోకూడా రియల్ కమ్యూనిస్ట్‌గా బతికిన వ్యక్తి నా తండ్రి, సినిమాలలో సంపాదించిన దానిని కూడా తిరిగి ప్రజలకే ఇచ్చిన తొట్టతొలి అభ్యుదయ హీరో మా నాన్న అని పేర్కొన్నారు.