వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత నడిబట్టలతో బయటికి వచ్చింది. చిన్నగా తన అభివృద్ది దిశగా రాష్ట్రం నడుస్తోంది. న్యాయపరంగా విభజన చేయకుండా ఆస్తులన్నీ తెలంగాణకు, అప్పులన్నీ ఏపీకి వచ్చేలా కాంగ్రెస్ ముందు నుంచి ఏపీకి కత్తితో పొడిస్తే, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, ఢిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తామని చెప్పి మోదీ నేతృత్యంలోని బిజెపి ఏపీని వెన్నుపోటు పొడిచింది. ఇక కొత్త రాష్ట్రాలు ఏర్పాటయినప్పుడు తెలంగాణది విస్తరాకులో పంచభక్ష్య పరమాన్నాలతో నిండిగా, ఏపీకి ఆకు కూడా లేని పరిస్థితి. ఇక తెలంగాణకి కోట్లాది రూపాయల మిగులు బడ్జెట్ కూడా ఉంది.
ఇక విషయానికి వస్తే తాజాగా దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. హైదరాబాద్‌లోనే మనుగడ కోల్పోయి, రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి వంటి వారిని కూడా దూరం చేసుకున్న టిడిపి తమది తెలుగు వారి పార్టీ అని, 2019లో జరిగే ఎన్నికల్లో టిడిపి తెలంగాణలో బలీయమైన శక్తిగా మారి, కర్ణాటకలో జెడిఎస్‌లా చక్రం తిప్పుతుందని చంద్రబాబు కలలు కంటున్నారు. మరోవైపు కేవలం తెలంగాణకే పరిమితమైన పార్టీలో కూడా తెలంగాణ పేరును ఉంచుకున్న టీఆర్‌ఎస్ పార్టీ ఏపీలో కూడా విస్తరించాలని భావిస్తున్నట్లు తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. నల్గొండ జిల్లాకు చెందిన పలువురు టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. టిఆర్‌ఎస్ పాలనతో తెలంగాణ అభివృద్ది దిశగా దూసుకెళ్తోందని, కేసీఆర్‌కి ఏపీలో కూడా అభిమానులు ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించాడు. అంతేకాదు కేసీఆర్ బేనర్లను కూడా ఏపీలో ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేస్తున్నారు.
ఇక మహారాష్ట్రలోని 40 గ్రామాల ప్రజలు తాము తెలంగాణలో కలుస్తామని పట్టుబడుతున్నారు అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ రెండు రాష్ట్రాల ఇద్దరు చంద్రుళ్లు తమ రాష్ట్రాలను నిలబెట్టుకోవడం మానేసి పక్క రాష్ట్రాల వైపు చూపు మళ్లించడం సరైన పద్దతి కాదనే చెప్పాలి. ఇదే జరిగితే ఉన్నదీ పోయే.. ఉంచుకున్నది పోయే అనే సామెత గుర్తుకురాక మానదు.