శ్రీదేవి మరణం తర్వాత ఇప్పుడిప్పుడే ఆమె పిల్లలైన జాన్వి, ఖుషీలు మామూలు మనుషులు అవుతున్నారు. ఇక త్వరలో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వికపూర్ నటించిన 'దడక్' సినిమా షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. మరాఠీ చిత్రమైన 'సైరత్'కి ఇది రీమేక్. కరణ్‌జోహార్ నిర్మిస్తున్న చిత్రానికి శశాంక్ దర్శకుడు కాగా ఇషాన్ ఖత్తర్ హీరోగా పరిచయం అవుతున్నాడు. అన్ని కుదిరితే ఈ చిత్రం జూన్ 15న దేశవ్యాప్తంగా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక శ్రీదేవి కూతురిని ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారు? అనే విషయంలో సినీ పండితులు సందిగ్ధంలో ఉన్నారు. తన తల్లి శ్రీదేవి చేసిన అతిలోక సుందరి మేజిక్‌ని జాన్వి చేయగలదా? లేదా? అనేదే ప్రశ్న. కానీ తన మొదటి చిత్రం విడుదల కాకముందే జాన్వికి మాత్రం విపరీతంగా క్రేజ్ వస్తోంది. తాజాగా ఆమె ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఓ రెస్టారెంట్ నుంచి బయటకి వస్తున్న సందర్భంగా పలువురు ఆమెని చూసేందుకు ఎగబడ్డారు. వీరిలో చిన్నపిల్లలే ఎక్కవగా ఉండటం విశేషం.
జాన్విని చుట్టూ చిన్నపిల్లలు చుట్టేస్తే పెద్దలకు మాత్రం ఆమె దగ్గరకి వచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది. కొందరు ఆమెని తాకాలని ప్రయత్నించగా, మరికొందరు ఆమెతో ఫొటోలకు ఎగబడ్డారు. ఇంత జనంలో కూడా జాన్వి అదుపు కోల్పోకుండా అందరినీ నవ్వుతూ పలకరిస్తూ, షేక్ హ్యాండ్స్ ఇస్తూ, ఫొటోలకు ఫోజులిచ్చి తన సెక్యూరిటీ సాయంతో కారులోకి ఎక్కి టాటా చెబుతూ వెళ్లింది. అది జాన్వి క్రేజ్ అంటే...!