మార్చ్, ఏప్రిల్ లలో రెండు బడా సినిమాలు బాక్సాఫీసుని దున్నేయ్యగా.. మే లో వచ్చిన పెద్ద సినిమా నా పేరు సూర్య ని తలదన్నేలా మీడియం బడ్జెట్ సినిమాగా మే 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి మూవీ మే హిట్ గా నిలిచిపోయింది. మీడియం బడ్జెట్ సినిమాగా వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టింది. నిర్మాత అశ్వినీదత్ ని మళ్ళీ నిర్మాతగా నిలబెట్టిన ఘనత మహానటికే దక్కుతుంది. సావిత్రి జీవిత కథను మహానటిగా తెరకెక్కించిన నాగ్ అశ్విన్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. కేవలం 20 నుండి 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మహానటి మూవీ ఇప్పుడు 35 కోట్ల షేర్ దాటేసింది.
ఇంకో 10 కోట్ల షేర్ తేవడం ఖాయమంటున్నారు. అలాగే మహానటి సినిమా శాటిలైట్స్ హక్కులు ఇంకా తెగలేదు. ఇక శాటిలైట్స్ హక్కులు, డిజిటల్, డబ్బింగ్ హక్కులు అన్ని కలిపి మహానటి కి 60 కోట్ల షేర్ తెచ్చే దమ్ముందని ట్రేడ్ వర్గాల భావన. మరి పెట్టిన పెట్టుబడికి ఇలా మూడింతల ఆదాయం మహానటి తేవడం అనేది మామూలు మాటలు కాదు. మరి ఈ సినిమాతో అశ్వినీదత్ మళ్ళీ కోలుకుని పెద్ద స్టార్స్ తో సినిమాలు నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో శక్తి, కంత్రి వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించి నిర్మాతగా బాగా చితికి పోయిన అశ్వినీదత్ మహానటితో మళ్ళీ పైకి లేచాడు.
మహానటికి విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు లేక సరిగ్గా బిజినెస్ జరక్కపోవడం అశ్వినీదత్ కి కలిసొచ్చిన అంశమే. అందుకే మహానటి సినిమాని అనేక చోట్ల అశ్వినీదత్ వాళ్ళు ఓన్ గా విడుదల చేసుకోవాల్సి వచ్చింది. కొన్ని ఏరియాల్లో నామమాత్రపు రేటుకు సినిమాను అమ్మారు. ఇప్పుడు చూస్తే ఈ చిత్రం పెద్ద సినిమాల స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది.