నేడు అన్నిరంగాలలోనూ వారసత్వాలు పెరిగిపోతున్నాయి. కానీ అది విజయాలకు షార్ట్‌కట్ కాదు. మొదట్లో అవకాశాలు వచ్చినా కూడా తదుపరి వాటిని నిలబెట్టుకుని ఆయా రంగాలలో నిలబడటం ముఖ్యం. కృష్ణ పెద్దకుమారుడు రమేష్‌బాబు విఫలమైతే మహేష్‌బాబు సక్సెస్ అయ్యాడు. హరికృష్ణ ఫెయిల్ అయితే బాలయ్య ఎదిగాడు. ఇక దాసరి, రాఘవేంద్రరావు, రవిరాజా పినిశెట్టి, కోదండరామిరెడ్డి వంటి వారి వారసులు బాగా కష్టాలలో ఉన్నారు. ఇక క్రికెట్‌లో చూసుకుంటే లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తనయుడు రోహన్ గవాస్కర్ కేవలం కొద్ది మ్యాచ్‌లకే పరిమితం అయ్యాడు. ఇక మరో క్రికెటర్ రోజర్ బిన్ని కుమారుడు స్టువర్ట్ బిన్నీ కూడా కొద్ది మ్యాచ్‌లకే పరిమితం అయి ఇప్పుడు ఐపిఎల్‌కే పరిమితం అయ్యాడు.
ఇక విషయానికి వస్తే తాజాగా ఓ నెటిజన్ స్టువర్ట్ బిన్ని, బిగ్‌బి అమితాబ్‌బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్‌పై విమర్శలు కురిపించాడు. తమ తండ్రుల ప్రజాదరణను వాడుకుని ఒకరు సినిమాలలోకి అడుగు పెడితే, మరొకరు క్రికెట్‌లోకి ప్రవేశించారు. అర్హులు కాని వారికి అందమైన భార్యలు కూడా వచ్చారు.. అంటూ ట్వీట్ చేసి నిజమని అనిపిస్తే రీట్వీట్ చేయమన్నాడు. ఈ ట్వీట్‌కి సంబంధించి అభిషేక్ బచ్చన్ తనదైన శైలిలో స్పందించాడు.
'సోదరా.. నా అడుగుజాడల్లో ఓ మైలు దూరం ప్రయాణించు. మీరు కనీసం పది అడుగులు వేసినా మిమ్మల్ని చూసి నేను ఇన్‌స్పైర్ అవుతాను. నిన్ను నీవు మెరుగుపరుచుకోవడం కోసం ప్రయత్నించు. ఇతరులు గురించి పక్కనపెట్టు. దేవుడు అన్నీ చూస్తూనే ఉన్నాడు. ఎవరి ప్రయాణం వారిదే. తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని బదులిచ్చాడు.
దాంతో ఆ నెటిజన్ కేవలం సరదాకి ఆ ట్వీట్ చేశాను. ప్రశాంతమైన వ్యక్తుల్లో మీరు ఒకరు. థియేటర్లలో మీరు నటించిన చిత్రాలు ఆడకపోయినా మీరు వేసే సూట్స్ చాలా బాగుంటాయి. ఈ ట్వీట్ కేవలం జోక్ మాత్రమే. మీ మనసును నొప్పించి ఉంటే క్షమాపణలు చెబుతున్నా. బిగ్‌బి అమితాబ్ కుమారుడిగా మీరు, సచిన్ టెండూల్కర్ కుమారుడిగా అర్జున్‌లపై ఎంత ఒత్తిడి ఉంటుందో ఊహించుకోగలను అంటూ తన వ్యాఖ్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేశాడు.