తండ్రి ఏయన్నార్ మరణం తర్వాత మరలా కుమారుడు నాగచైతన్య వివాహం, కొడుకుల భవిష్యత్తు, తన కెరీర్ ప్లానింగ్ ఇలా నాగార్జున బిజీగా ఉన్నాడు. ఇక తన తండ్రి లేని విషయాన్ని ఆయన గుర్తు తెచ్చుకుంటూ ఏ కుమారుడు తన తండ్రికి ఇవ్వనన్ని శ్రద్దాంజలిలను నాగ్ తన తండ్రి ఏయన్నార్‌కి అందిస్తున్నాడు. ఇక తాజాగా ఆయన మే 23 ప్రత్యేకతను చెబుతూ, ఇదే రోజున అక్కినేని ఫ్యామిలీ నటించిన 'మనం' చిత్రం విడుదలైంది. ఈ చిత్రం విడుదలై నాలుగేళ్లు గడిచింది. ఈ 'మనం' చిత్రంలో ఏయన్నార్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌తో పాటు ఆ తర్వాత ఈ ఇంటి కోడలైన సమంత కూడా నటించడం విధి విచిత్రమనే చెప్పాలి. ఇక ఈచిత్రం షూటింగ్ సమయంలోనే ఏయన్నార్ తన ఆర్యోగం క్షీణిస్తోందని తెలిసి, ముందుగా క్లైమాక్స్ చిత్రీకరణ, తన డబ్బింగ్‌ని ఆయన పూర్తి చేశారు.
ఇక మే 23 గురించి నాగార్జున ట్వీట్ చేస్తూ, నాన్ననిన్ను ఎప్పుడు తల్చుకుంటూనే ఉంటాం. నా మొదటి సినిమా 'విక్రమ్'. మనం కలిసి నటించిన చిత్రం 'మనం'. ఈ రెండు చిత్రాలు మే23నే విడుదలయ్యాయి. ఇది కావాలని చేసింది కాదు. విధివిచిత్రం అంతేనేమో. యాదృచ్చికమో, లేక ఈ విశ్వం నెంబర్ల ధర్మాన్ని పాటిస్తుందో తెలియదు గానీ మే 23 మాకు ఎంతో ముఖ్యమైంది. ఇక 23ని తిప్పేస్తే 32 అవుతుంది. నేను కెరీర్‌ని ప్రారంభించి 32 ఏళ్లు కావడం కూడా విచిత్రం. మాపై ప్రేమను చూపిస్తున్న అందరికీ కృతజ్ఞతలు అని తెలిపాడు. ఈ సందర్భంగా నాగార్జున ఇప్పటి వరకు విడుదల చేయని 'మనం' పోస్టర్‌ని ఒకదానిని రిలీజ్ చేశాడు.
ఇక నాగ్ ప్రస్తుతం రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో 'ఆఫీసర్' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం జూన్1న విడుదల కానుంది. మరోవైపు నేచురల్ స్టార్ నానితో కలిసి ఓ మల్టీస్టారర్ చేస్తున్నాడు. ఈ చిత్రం టైటిల్‌ని త్వరలో ప్రకటించనుండగా, సెప్టెంబర్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయానా' చిత్రానికి ప్రీక్వెల్‌గా కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' చిత్రం చేయనున్నాడు. మరోవైపు ఫ్లాప్‌లో ఉన్న వర్మకి చాన్స్ ఇచ్చినట్లుగా ఆయన మరో ఫేడవుట్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'శివమణి, సూపర్' చిత్రాల తర్వాత ఆయనతో మరో చిత్రం చేస్తున్నాడు....!