ఈ మధ్యన టాప్ డైరెక్టర్స్ నిర్మాతల దగ్గర నుండి తమకి వచ్చే రెమ్యునరేషన్ తో పాటుగా సినిమా విడుదలై విజయం సాధించాక లాభాల్లో వాటాలు కూడా తీసుకుంటున్నారు. గతంలో ఈ లాభాల్లో వాటా అనేది కేవలం రాజమౌళి మాత్రమే చేసేవాడు. కానీ తర్వాత తర్వాత తాను చేసిన సినిమాలన్నీ హిట్ అయ్యేసరికి కొరటాల శివ కూడా భరత్ అనే నేను సినిమా లాభాల్లో వాటా తీసుకున్నాడన్నారు. తాజాగా ఇప్పుడు ఈ కోవలోకి మరో డైరెక్టర్ చేరబోతున్నాడు. రంగస్థలంతో మొదటిసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సుకుమార్ ఈసారి తన న్యూ ప్రాజెక్ట్ విషయంలో రెమ్యునరేషన్ తో పాటుగా లాభాల్లో వాటా తీసుకోబోతున్నాడట.
మాములుగా ఈ మధ్యన టాప్ డైరెక్టర్స్ తమ రెమ్యునరేషన్ ని సినిమా సినిమాకి తెగ పెంచుకుంటూ పోతున్నారు. టాలీవుడ్ లో చాలామంది డైరెక్టర్స్ 10 పైనే కోట్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు సుకుమార్ కూడా రంగస్థలం సినిమాతో నిర్మాతలు మైత్రి మూవీస్ వారికి భారీ హిట్ అందించాడు. అందుకే సుకుమార్ తాను చెయ్యబోయే మహేష్ బాబు సినిమాకి మైత్రి మూవీస్ వారు ఏకంగా 18 కోట్ల రెమ్యునరేషన్ తో పాటుగా లాభాల్లో వాటా ఇచ్చేట్టుగా ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా వార్తలొస్తున్నాయి. మరి రంగస్థలం హిట్ తో సుకుమార్ కూడా రాజమౌళి, కొరటాల సరసన చేరిపోయాడు.
మరి లాభాల్లో వాటా అంటే గనక సినిమాని ఖచ్చితంగా హిట్ చేసేట్టుగా డైరెక్టర్స్ తపన పడతారు. లాభాల్లో వాటా లేకపోయినా డైరెక్టర్స్ ఎవరైనా తమ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటారు. ఎందుకంటే సినిమా ఫలితం తేడా కొడితే వారికీ మరో ఛాన్స్ రావడం అనేది జరగదు. అందుకే తమ సినిమా హిట్ విషయంలో చాలా తపన పడతారు. కానీ లాభాల్లో వాటాలు అంటే మాత్రం డైరెక్టర్స్ పై మరింత బాధ్యత, అలాగే ఒత్తిడి కూడా కాస్త ఎక్కువ ఉంటుంది. మరి రంగస్థలం హిట్ తర్వాత సుకుమార్ పై చాలా ఒత్తిడి ఉంటుంది. ఇక సుకుమార్ కూడా మహేష్ తో చెయ్యబోయే సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి మహేష్ ని సంతోష పెట్టాలని చూస్తున్నాడు.