'మహానటి' విజయంతో నిజాయితీగా, ఆహ్లాదకరంగా బయోపిక్‌లను తీస్తే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం ఖాయమనే నమ్మకం మన మేకర్స్‌లో, ప్రేక్షకుల్లో కూడా నమ్మకం కుదిరింది. ఇక ప్రస్తుతం బాలయ్య ఎన్టీఆర్ చిత్రం విషయంలో డైలమా వీడకపోయినా వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి బయోపిక్ విషయంలో మాత్రం అడుగులు త్వరత్వరగా పడుతున్నాయి. ఈ చిత్రం వైఎస్ పూర్తి జీవితం ఆధారంగా కాకుండా ఆయన చేసిన పాదయాత్ర, తర్వాత రెండు సార్లు అధికారంలోకి వచ్చిన విషయాలను చూపిస్తూ, వాటిచుట్టూనే కథ తిరిగేలా కథను సిద్దం చేసుకున్నారని సమాచారం. 'ఆనందోబ్రహ్మ' దర్శకుడు మహి వి.రాఘవ తనరెండో చిత్రానికే ఇంతటి భారీ నేపధ్యం ఉన్న కథను ఎంచుకోవడం ఆశ్చర్యకరమే.
ఇక ఇందులో వైఎస్ పాత్రను మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి పోషిస్తుండగా, వైఎస్ విజయమ్మ పాత్రను 'బాహుబలి' ఫేమ్ ఆశ్రిత వేముగంటి పోషిస్తున్నారు. ఇక వైఎస్ అనుచరుడు సూరీడు పాత్రను పోసాని కృష్ణ మురళి, వైఎస్ ఆత్మ కెవిపి రామచంద్రరావు పాత్రను రావు రమేష్‌లు పోషిస్తున్నారట. ఇక ఈ బయోపిక్‌లో వైఎస్ షర్మిల, వైఎస్ భారతిలకు పెద్దగా స్థానం లేదని తెలుస్తోంది. ఇక కథకు కేవలం రెండు మూడు సీన్లు కీలకంగా ఉండే పాత్రకే వైఎస్ షర్మిల పరిమితం కానుంది. దాంతో ఈ పాత్రను పోషించడానికి భూమికను అప్రోచ్ అవ్వగా ఆమె నో చెప్పిందని సమాచారం.
కానీ దర్శకుడు మాత్రం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదే భూమిక కనుక ఒప్పుకుంటే ఎంఎస్‌ధోని తర్వాత ఆమె నటించే రెండో బయోపిక్‌గా 'యాత్ర' నిలుస్తోంది. ఇక ఈ చిత్రంలోని గాంధీ భవన్ వంటి ముఖ్య సన్నివేశాలను జూన్ 18నుంచి చిత్రీకరించడం మొదలుపెడతారని అంటున్నారు. ఈ చిత్రం 70ఎంఎం బేనర్‌లో నిర్మితం కానుంది.