గతంలో బాలయ్య పరుచూరి బ్రదర్స్ కాంబినేషన్ లో చాలా సినిమాలు చేశాడు. ముఖ్యంగా బాలయ్యకు పేరు తెచ్చిపెట్టిన ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’, ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ లాంటి సినిమాలకు కథతో పాటు స్క్రీన్ ప్లే లో సహకారం అందించడం, మాటలు రాయడం చేశారు. అప్పటి వరకు ఒక రూట్ లో ఉన్న బాలయ్యని కమర్షియల్ హీరోగా నిలబెట్టారు వీరిద్దరూ. అందుకే బాలయ్యకు వీరంటే ఇష్టం, నమ్మకం.
వారితో చేసిన సినిమాలు బాలయ్య ఇంకా ఎవరితో చేయలేదు. అయితే ‘నరసింహనాయుడు’ తర్వాత వీళ్ల కాంబినేషన్ బెడిసికొట్టింది. ఈ సినిమా తర్వాత బాలయ్య వీరి కాంబినేషన్ లో ‘పలనాటి బ్రహ్మనాయుడు’ చేశాడు. ఆ సినిమాకి మాటలు, స్క్రీన్ ప్లే ఇచ్చింది పరుచూరి సోదరులే. ఆ సినిమాలో తొడ గొడితే ట్రైన్ వెనక్కెళ్లిపోవడం.. కుర్చీ ముందుకు రావడం లాంటి సిల్లీ సీన్లు రాసి బాలయ్య ఇమేజ్ ను డ్యామేజ్ చేశారంటూ వాళ్లపై విమర్శలొచ్చాయి.
ఆ తర్వాత వీరితో బాలయ్య చేసిన సినిమాలన్నీ తేడా కొట్టేస్తుండటంతో బాలయ్య వాళ్లకు టాటా చెప్పేశాడు. మళ్లీ సుదీర్ఘ విరామం తర్వాత పరుచూరి సోదరులు బాలయ్య సినిమాకు రచన చేస్తున్నట్లు సమాచారం. బాలయ్య త్వరలో వినాయక్ డైరెక్షన్ లో ఓ మలయాళం సినిమాను రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రచయితలుగా పలు పేర్లు పరిశీలించి చివరికి పరుచూరి సోదరులకు ఫిక్సయ్యారట. ఎన్టీఆర్ బయోపిక్ లేట్ అయ్యే అవకాశం ఉండడంతో వినాయక్ సినిమా త్వరగా మొదలు పెట్టేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. 'చెన్నకేశవ రెడ్డి' సినిమా తర్వాత మళ్లీ వీరి కాంబినేషన్ వస్తున్నా ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి.