ఇటీవల 'నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా' వేడుక సందర్భంగా రామ్‌చరణ్ సినిమా వారి కష్టాలు చెప్పుకొచ్చాడు. ఎప్పుడో షూటింగ్ రాత్రి పూర్తయితే ఇంటికి వచ్చి పక్కరోజు ఏ సీన్ ఎలా చేయాలి? అనే ఆలోచనలతో ఉదయాన్నేలేచి జిమ్ చేసి, మేకప్ వేసుకుని. ఇలా తమ జీవితం నిత్యం బిజీగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. నిజమే సినిమా వారి జీవితాలు వెండితెరపై కనిపించేంత గొప్పగా ఏమీ ఉండవు. ఎప్పుడు ఉరుకులు పరుగులు జీవితమే.
ఇక 'మహానటి' సందర్భంగా కీర్తిసురేష్ కూడా తన కష్టాన్ని చెప్పుకొచ్చింది. ప్రోస్థటిక్ మేకప్ వేయడానికి మూడు గంటలు, దానిని తీసి వేయడానికి మూడు గంటలు పట్టేదని, ఆ సమయంలో ఏమీ తినడానికి కూడా వీలుండదని చెప్పింది. ఇవన్నీ నిజమే. ఇక సినిమా వారికి సండే అయినా మండే అయినా పని తప్పదు. బిజీగా ఉండే వారు రోజుకి నాలుగైదు షిఫ్ట్‌లలో కూడా పనిచేస్తారు. ఒకే ఏడాదిలో ఎక్కువ చిత్రాలను చేసిన ఘనత ఉన్న కృష్ణ కూడా రేయింబవళ్లు షూటింగ్‌లలోనే కాలం గడిపేవాడు. ఇక ఇంత అలిసిపోయిన వారికి కనీసం ఎనిమిది నుంచి పన్నెండు గంటల నిద్ర అవసరం. ఇక మామూలు వ్యక్తులైతే కాస్త ఆదివారం, వీకెండ్స్‌లో అయినా రిలాక్స్ అవుతారు. కానీ అది సినిమా వారికి వీలు కాదు.
ఇక విషయానికి వస్తే ప్రస్తుతం నితిన్ హీరోగా రాశిఖన్నా హీరోయిన్‌గా దిల్‌రాజు నిర్మాతగా సతీష్‌వేగ్నేష దర్శకత్వంలో 'శ్రీనివాసకళ్యాణం' షూటింగ్ వేగంగా జరుగుతోంది. దిల్‌రాజు మొదటి చిత్రం దిల్ చేసిన తర్వాత ఇంత కాలానికి మరలా నితిన్‌తో దిల్‌రాజు చిత్రం చేస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ పంజాబ్, ఢిల్లీ, చండీఘడ్ వంటి చోట జరిగింది. ఇక ఆదివారం రావడంతో రాశిఖన్నా కనీసం హాఫ్‌డే నిద్రపోవాలని భావించింది. కానీ 'సండే కూడా బిజీనే' అంటూ నాకు పన్నెండు గంటల నిద్ర అవసరం. కానీ వర్క్ చేయాలి, అది సండే అయినా కూడా అంటూ లోకేషన్ పిక్‌ని రాశిఖన్నా పోస్ట్ చేసింది. నిజమే..సీత కష్టాలు సీతవి. పీత కష్టాలు పీతవి.