హీరో శివాజీకి పవన్‌కళ్యాణ్‌కి ఉన్న ఫాలోయింగ్, క్రేజ్, ఇమేజ్ వంటి వాటిల్లో వందోవంతు కూడా లేదు. కానీ ఆయన బిజెపిలో ఉండి కేవలం ప్రత్యేకహోదా ఇవ్వనందుకు మోదీని తీవ్రంగా విమర్శించేందుకు కూడా జంకడం లేదు. ఇక నాడు ప్రత్యేకహోదా ఉద్యమం, జల్లికట్టు స్ఫూర్తితో నిరసన వ్యక్తం చేయడం, కేంద్రం ప్రత్యేకహోదా బదులు రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని చెప్పడం, మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపెడితే దేశవ్యాప్తంగా తిరిగి చివరకు కాంగ్రెస్ మద్దతు కూడా ఇప్పిస్తానని చెప్పిన పవన్ గత కొంతకాలంగా కేంద్రాన్ని పల్లెత్తు మాట అనడంలేదు. బహుశా ఆయనకు కూడా బిజెపి అధినాయకత్వం తమిళనాడు నాయకుల తరహాలో పవన్‌కి ముందస్తు హెచ్చరికలు చేసిందని, దాంతో పవన్ బిజెపి విషయంలో చల్లబడిపోయాడని అంటున్నారు.
పవన్ ఇలా మౌనంగా ఉన్నప్పటికీ హీరోశివాజీ మాత్రం మోదీని కూడా ఘాటుగా విమర్శిస్తున్నాడు. మోదీని నానా విధాలుగా టార్గెట్ చేస్తున్నాడు. దాంతో బిజెపి శ్రేణులు శివాజీ అంటే మండిపడుతున్నాయి. తాజాగా ఏపీ బిజెపి అధ్యక్షునిగా ఎన్నికైన కన్నాలక్ష్మీనారాయణ ఢిల్లీ నుంచి విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో దిగాడు. ఆయనకు స్వాగతం పలికేందుకు బిజెపి శ్రేణులు విమానాశ్రయానికి వచ్చాయి. అంతలోనే హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి శివాజీ వచ్చారు. దీంతో శివాజీని చూసిన బిజెపి శ్రేణులు మోదీనే విమర్శిస్తావా? అంటూ శివాజీపై నోటికి పనిచెప్పారు. పరుష పదజాలంతో దుర్భాషలాడారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఇంతలో పోలీసులు కలుగజేసుకుని శివాజీని కారులోకి ఎక్కించి పంపివేశారు. తాను ఇలాంటి దాడులకు భయపడనని, ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేంతవరకు మోదీని ఇలాగే విమర్శిస్తానని శివాజీ తెలిపాడు.
బిజెపికి చెందిన పలువురు నేతలు తనతో ఎంతో బాగుంటారని, కానీ ఇప్పుడు అడ్డుకున్న వారంతా పెయిడ్ ఆర్టిస్టులని శివాజీ అన్నాడు. తమ రాష్ట్ర అధ్యక్షుని రాక కోసం తమ బలనిరూపణ చూపించేందుకు డబ్బులు తీసుకుని వచ్చిన పెయిడ్ ఆర్టిస్టులు తనపై నోరు పారేసుకున్నారని, తనపైదాడికి ప్రయత్నం చేసిన అందరి మొహాలు తనకు తెలిసే ఉన్నాయని, వారిపై చర్యలు తీసుకునే వరకు తాను వారిని వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పాడు. అయినా బిజెపి కార్యకర్తలు, నేతలు ఇంత ప్రజాస్వామ్య విరుద్దంగా భౌతిక దాడులకు పాల్పడడాన్ని ఎలా వర్ణించాలోఅర్ధం కాని పరిస్థితి అనే చెప్పాలి!