ఎన్నిసార్లు హీరోల తమ మధ్య ఉన్న ఆప్యాయతలను చాటుకున్నా, ఒకరితో కలిసి ఒకరు కలిసి ఫొటోలు తీసుకుని, ఒకరి సినిమాలను మరొకరు మెచ్చుకున్నా వారి అభిమానుల మధ్య మాత్రం విపరీతమైన వాదోపవాదాలు, గొడవలు సాగుతూనే ఉంటాయి. మరి ఈ విషయంలో తమ హీరోల మాటలను దైవంగా భావించే వారి ఫ్యాన్స్ దీనిని మాత్రం ఎందుకు పట్టించుకోరో అనేది మాత్రం అర్ధం కాని విషయం. ఇక హీరోల అభిమానులు హీరోల కులాలను బట్టి కూడా ఆరాధిస్తుండటం మరింత విపరీత పోకడ. మరోవైపు హీరోలేమో అభిమానులు తిట్టుకునే కులాల వారిని హ్యాపీగా వివాహాలు చేసుకుంటూ ఉంటారు. బన్నీ, రామచరణ్‌లు కూడా రెడ్డి కులస్తులనే చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఇటీవల మహేష్‌బాబు సినిమాలకు పోటీగా రామ్‌చరణ్ చిత్రాలు విడుదలవుతున్నాయని ఇది కావాలనే జరుగుతోందని కొందరు విపరీత వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. దీనిపై మెగాపవర్‌స్టార్ మరోసారి స్పందించాడు. తనకు, మహేష్ ఎంతో స్నేహితుడని, ఇదంతా కొందరు పనిగట్టుకుని చేస్తున్న అసత్య ప్రచారమని తెలిపాడు. మహేష్ నాకు బెస్ట్ ఫ్రెండ్. మా ఇద్దరి మధ్యా ఎలాంటి పోటీ లేదు. ఎవరి సినిమా కలెక్షన్లు ఎంత అనేది మేమెప్పుడు లెక్కించలేదని ఆయన ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేల్చి చెప్పాడు. 'రంగస్థలం, భరత్ అనే నేను' చిత్రాలు రెండూ అద్భుతమైన విజయం సాధించడం మాకెంతో సంతోషాన్ని అందించింది. పర్సనల్ హిట్ కొట్టడం కన్నా ఇండస్ట్రీకి మరో హిట్ లభించడం మాకెంతో ఆనందాన్ని కలిగించే విషయం... అని ఇలా ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నాయని చెప్పి పబ్బం గడుపుకునే వారి చేష్టలకు చెక్ చెప్పాడు.
ఇక మన స్టార్స్ కూడా ఆమధ్య ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో గడుపుతున్నారు. తమ చిత్రాల విడుదలలు క్లాష్ కాకుండా కనీసం రెండు వారాలకు పైగా గ్యాప్ ఉండేలా చూసుకుంటున్నారు. 'రంగస్థలం, భరత్ అనే నేను, నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా' వంటి చిత్రాలన్నీ తగినంత గ్యాప్‌లో విడుదల కావడమే దీనికి నిదర్శనం. మొత్తానికి మన హీరోలు మారుతున్నారు. వారికి తగ్గట్లుగా మన హీరో అభిమానులు కూడా మారితే మంచి సుహృద్భావ వాతావరణం నెలకొంటుంది. ఇది అందరికీ మంచిదనే చెప్పాలి.