దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్ణాటక ఎన్నికల తీర్పుతో జనసేనానికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నట్లే కనిపిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికలు నిజంగా మోదీ పతానానికి ముహూర్తం పెడతాయా? లేక బిజెపికే జనాలు పట్టం కడతారా? అనేది రెండురోజుల్లో తేలిపోనుంది. ఈ ఎన్నికల్లో యువతరం, మరీ ముఖ్యంగా తెలుగు వారి ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు కీలకం కానున్నాయి. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో మోదీ, కేంద్రంలోని బిజెపిలు తెలుగుజాతికి చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా తెలుగు ఓటర్లు కాంగ్రెస్‌కి ఓటు వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు ఈ ఎన్నికల ముందు వరకు దీనిని మోదీ వర్సెస్ రాహుల్‌గాంధీ మద్య పోటీలా భావించారు. కానీ నాడు ఏపీలో వైఎస్‌రాజశేఖర్‌రెడ్డిలా తనదైన పాలన చేసిన సిద్దరామయ్య వర్సెస్ మోదీగా ఈ ఎన్నికలు మారడం సిద్దరామయ్య బలాన్ని నిరూపిస్తోంది.
ఇక కర్ణాటకలో హంగ్‌వస్తే పవన్ మద్దతు తెలిపిన జెడిఎస్ ఎవరికి మద్దతు తెలపనుంది అనేది కీలకం కానుంది. అదే జెడిఎస్ బిజెపికి మద్దతు ఇస్తే మాత్రం ఏపీలో కూడా పవన్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంకావడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే పవన్ ఈ విషయంలో ఏపీ ప్రజలకు సంజాయిషీ ఇవ్వక తప్పని పరిస్థితి. మరోవైపు పవన్‌కళ్యాణ్‌కి ఎప్పటినుంచో తిరుమలలో మూడు రోజులు, మూడు నిద్రలు గడపాలనే మొక్కు ఉందిట. సో..ఆయన ఏపీలోని 13 జిల్లాలలో పర్యటన ప్రారంభించనున్న నేపధ్యంలో ఈ మొక్కు తీర్చుకుంటున్నాడు. ఆయన కాలి నడక ద్వారా తిరుమల చేరుకున్నారు. పక్కవారిని పలకరిస్తూ, కాస్త విరామం తీసుకుంటూ, కుక్కలకు బిస్కెట్స్ వేస్తూ ఆయన కాలినడక సాగింది.
పవన్ తిరుమల శ్రీవారిదర్శనానికి వచ్చిన సందర్భంగా టిటిడి అధికారులు ఆయనకు స్వాగతం పలికి, స్వామి వారి దర్శనం చేయించి, తీర్ధప్రసాదాలు అందించారు. ఇక ఈ మూడురోజులు ఆయన అక్కడి పుణ్యతీర్ధాలు, దేవాయాలను సందర్శించడమే కాదు.. శ్రీవారి దర్శనంలో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా స్వయంగా తెలుసుకోనున్నాడు. ఇక ఈయన శ్రీకాకుళంలోని ఇచ్చాపురం వెళ్లి అక్కడి నుంచి బస్సులో గ్రామ స్వరాజ్య యాత్రను ప్రారంభించనుండటం విశేషం.