దేశంలోనే మహానటి అని పిలిపించుకోగలిగిన ఏకైక నటి సావిత్రి. ఇక ఈమె జీవితంపై తాజాగా అశ్వనీదత్ సమర్పణలో ప్రియాంకాదత్, స్వప్నదత్‌లు నిర్మాతలుగా.. 'ఎవడే సుబ్రహ్మణ్యం' ఫేమ్ నాగ్ అశ్విన్ 'మహానటి' అనే అద్భుతాన్ని ఆవిష్కరించాడు. చిత్రాలు చూసే అలవాటు లేని వారు కూడా ఈ చిత్రం చూడాలని కోరుకుంటూ ఉండటం విశేషం. ఇప్పటికే ఈ చిత్రానికి సినీ రాజకీయ ఇతర రంగాల ప్రముఖుల ప్రశంసలు అందుతున్నాయి. ఎన్ని సినిమాలు తీశాం అనేది పాయింట్ కాదు. ఎంత లేటయినా ఎలాంటి చిత్రం తీశామనేది ముఖ్యమని మరోసారి నాగ్‌అశ్విన్ ఈ చిత్రం ద్వారా నిరూపించాడు.
ఇక ఈ 'మహానటికి సంబంధించి దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు ప్రియాంకా దత్, స్వప్నాదత్‌లతో పాటు అశ్వనీదత్‌ని చిరంజీవి తమ ఇంటికి ఆహ్వానించి తెలుగు జాతి గర్వపడే చిత్రం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలపడంతోపాటు హృద్యంగా ఈ చిత్రాన్ని తీసిన దర్శకనిర్మాతలను సత్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి నాగ్ అశ్విన్‌తో ఈ చిత్రంలో సావిత్రి మద్యం తాగే సీన్‌ని చూపించారు. దానికి ఆమె కూతురు విజయ చాముండేశ్వరి నుంచి అభ్యంతరం వ్యక్తం కాలేదా? అని అడిగితే, విజయ చాముండేశ్వరి ఈ సీన్‌కి అభ్యంతరం చెప్పలేదు. అది నిజంగా జరిగింది కాబట్టి చూపించమనే చెప్పారు. ఇక ఈ విషయాన్ని హైలైట్ చేయకుండా ఆమె బయోపిక్ ఓ సెలబ్రేషన్‌లా మిగిలిపోయేలా చిత్రాన్ని తీశామని తెలిపాడు.
ఇక ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ చిత్రం చేయనున్నాడని మాట ఇచ్చాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో తానే నిర్మిస్తానని అశ్వనీదత్ తెలుపగా, ఈ చిత్రం జానపద జానర్‌లో ఉండనుందని, టైటిల్‌గా 'భైరవ' అని అనుకుంటున్నారని తెలుస్తోంది. చిరు ఓకే చేస్తే ఈ స్క్రిప్ట్‌పై నాగ్ అశ్విన్ ఏడాది పాటు పనిచేయడానికి సుముఖంగా ఉన్నాడని, 'సైరా..'కి ఎలాగూ ఏడాది పడుతుంది కాబట్టి ఈ సమయంలో నాగ్ అశ్విన్ తన సమయాన్నంతా అదే స్క్రిప్ట్‌పై పెడతానని చెప్పాడట. ఇక ఈ చిత్రం తను హీరోగా నటించగా, అశ్వనీదత్ నిర్మాణంలో రూపొందిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' చిత్రం విడుదలైన మే 9నే విడుదల కావడం పట్ల చిరంజీవి సంతోషం వెలిబుచ్చారు.