మనదేశంలో ఏదైనా ఘటనలు జరిగినప్పుడు వుండే హంగామా, ప్రజలు తీవ్రంగా రెస్పాండ్ అవ్వడం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీడియాలో కూడా నాలుగైదురోజులు చర్చ పెట్టి టీఆర్పీలను పెంచుకోవడానికి ఉబలాటపడతారు. అది నిర్భయ అయినా, ఆయేషా మీరా అయినా, మలయాళ నటి భావన అయినా ఇది కేవలం కొన్నిరోజులకే పరిమితం అవుతుంది. అయినా ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీ మోతగా ఉంటుంది మన వారి పరిస్థితి. ఇంటిగుట్టు బయట పడితే ఉలిక్కిపడే వారు ఇతరుల విషయంలో మాత్రం నీతులు చెబుతూ ఉంటారు. ఒక వేలు ఎదుటి వారికి చూపిస్తే, నాలుగువేళ్లు తమవైపే చూపుతాయనే విషయం మన ప్రముఖులకు తెలిసినా విస్మరిస్తూ ఉంటారు.
ఇక తాజాగా ఉన్నావా ఘటనలో బిజెపి ఎమ్మెల్యే కుల్‌దీప్‌సింగ్ సెంగారేనే ప్రధాన దోషిగా సిబిఐ తేల్చిచెప్పింది. నిజానికి దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. వావి వరసలు కూడా చూడకుండా తోటి బంధువులు, తండ్రులు కూడా కూతుర్లపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మైనార్టీ వయసులో కూడా లైంగిక నేరాలకు పాల్పడే వారికి అంతులేదు. ముఖ్యంగా బలవంతులు, ఆర్ధికంగా బలంగా ఉన్నవారు. సమాజంలో ఉన్నత స్థితిలో, రాజకీయాలలో పవర్ ఉండే వారు, పెద్ద పెద్దల విషయంలో ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇక కాస్టింగ్‌కౌచ్ గురించి ఎవరు ఎన్ని చెప్పినా ఇందులో కూడా లైంగిక వేధింపులు ఉంటాయనేది సినీ అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. అయినా అన్నిచోట్లా ఉంది కదా...మమ్మల్యే ఎందుకు టార్గెట్‌చేస్తున్నారు? అనేది పసలేని వాదన.
ఇక ఓ బిజెపి ఎమ్మెల్యే అయి ఉన్నావా ఘటనలో దోషిగా తేలిన ఎమ్మెల్యేని వెంటనే ఉరి తీయాలని మంచు మనోజ్ ఆవేశంతో చెబుతున్నాడు. ఆయనపై జాలి చూపించవద్దు. వీలైనంత తొందరగా అతడిని ఉరితీయాలి. న్యాయస్థానాలు ఇలాంటి వారిని వీలైనంత తొందరగా చంపేయాలి అని మనోజ్ అంటున్నాడు. మన దేశం ఒక్క రాత్రిలో నోట్లను రద్దు చేయగలదు గానీ అత్యాచార చట్టాలను బలంగా తయారు మాత్రం చేయలేదని ఆయన తెలిపాడు.
నిజానికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సొంత భార్యనైనాసరే వారి ఇష్టం లేకుండా లైంగికంగా వేధిస్తే అది కూడా రేప్ కిందకే వస్తుంది. ఇక మంచు మనోజ్ చెప్పింది నిజమే అయినా, మరి లైంగికంగా ఇష్టం లేకుండా లొంగదీసుకుంటున్న సినిమా వారికి కూడా ఏ శిక్షలు వేయాలో సూచిస్తే బాగుంటుంది. బలమైన ఫ్యామిలీల మాటున నలిగిపోతున్న మహిళల తరపున ఈయన తన గళం వినిపిస్తే మరింతగా బాగుంటుంది.