ఒకవైపు సినిమాలను బాగా చూసే తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ ఇటీవల 'భరత్ అనే నేను' కోసం ఎంతో ప్రమోషన్ చేసిపెట్టి నైజాంలో ఈ చిత్రం కలెక్షన్లు మరింత పెరగడానికీ తనవంతు ప్రయత్నం చేశాడు. ఇక ఈయన ఎవ్వరూ పిలవకుండానే మొదటి రోజే వీలు చూసుకుని 'మహానటి' సినిమాని చూసి అద్భుతం అంటూ నటీనటులకు, సాంకేతిక నిపుణులు, టీంకి శుభాకాంక్షలు తెలిపాడు. ఇక పెద్దగా సినిమా చూసే అలవాటు లేని లోక్‌సత్తా జయప్రకాష్‌నారాయణ్ కూడా ఇప్పుడు సినిమాలు బాగానే చూస్తున్నట్లు ఉన్నాడు.
ఇటీవల 'భరత్ అనే నేను'ని మెచ్చుకుని, కొరటాల, మహేష్‌లకి శుభాకాంక్షలు తెలిపిన ఆయన తాజాగా అంటే సినిమావారు కూడా ఇంకా అందరు చూశారో లేదో గానీ 'మహానటి'ని వెంటనే చూశాడు జెపి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మహానటి' సినిమా చూశాను. అసామాన్య నటి సావిత్రిపై ప్రేమతో ఈ బయోపిక్‌ని అద్భుతంగా తీశారు. సినిమాలో నటించిన నటీనటులు, తెర వెనుక పనిచేసిన బృందం, నిర్మాతలు, దర్శకుడు .. ఇలా అందరు అద్భుతంగా పనిచేశారు. ఈ చిత్రం ఓ గొప్పనటికి జీవం పోసింది. కన్నీరు ఆపుకోవడం కష్టం. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు చేసిన కీర్తిసురేష్, సమంతలు అద్భుతంగా నటించారు. నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ సినిమా నన్ను ఎంతో కదిలింపజేసింది. భావోద్వేగం చెందేలా చేసింది. నా హృదయంలో జీవిత కాలం ఉండిపోతోంది.. అని చెప్పారు.
నిజంగానే ఈ ప్రశంసలకు ఈ టీమ్ అర్హులనే చెప్పాలి. వీరి ప్రశంసల ద్వారా సినిమాలకు మరింత ప్రమోషన్ రావడం ఖాయం. కానీ తెలంగాణలోని కాంగ్రెస్‌వారు, ఇతర విపక్షాలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ నాయకులు మాత్రం సినిమాలలో లీనమైపోయారని, వీరు రివ్యూ రైటర్స్‌గా మారితే మంచిదని సెటైర్లు వేస్తున్నారు.