బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సావిత్రి బయోపిక్ మహానటి.. అందరిని విపరీతంగా ఆకట్టుకుంటుంది. సావిత్రి మళ్ళీ పుట్టింది అన్నట్టుగా సావిత్రి రోల్ చేసిన కీర్తి సురేష్ ఉంటే.. మధురవాణిగా సమంత, జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటనతో పాటుగా.. ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ చేసిన నాగ చైతన్య, షాలిని పాండే, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, శ్రీనివాస్ అవసరాల, సందీప్ వంగా, క్రిష్ వంటి వారు తమకిచ్చిన గెస్ట్ రోల్స్ ని పరిపూర్ణమైన నటనతో అదరగొట్టేసారు. మహానటి సినిమా చూసిన ప్రతి ఒక్కరు మహానటికి జేజేలు పలుకుతున్నారు. ఇక పరిశ్రమలోని పలువురు నాగ్ అశ్విన్ డైరెక్షన్ ని తెగ పొగిడేస్తున్నారు.
అయితే మహానటి సినిమాలో.. తాతగారు ఏఎన్నార్ పాత్ర చేసిన నాగ్ చైతన్య సూపర్ అంటూ నాగార్జున సోషల్ మీడియాలో ట్వీట్ చేసాడు. అలాగే.. ఈ మహానటి సినిమా చూసిన తరువాత తన కళ్లు చమర్చాయని... సావిత్రమ్మకు ఈ చిత్రం ఓ నివాళిగా నిలిచిపోతుందని... కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంతలు చాలా చక్కగా నటించారని, డైరెక్టర్ నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారని గత రాత్రి నాగ్ ట్విట్టర్ లో మహానటి టీమ్ ని తెగ పొగిడేసాడు. అలా నాగ్ తన స్పందనను ట్వీట్ రూపంలో తెలియజెయ్యగా... దానికి సమంత రీ ట్వీట్ చేసింది.
నాగార్జున కోడలిగా సమంతని అనుకున్నప్పటి నుండే.. నాగార్జున, సమంత ని కోడలా అని సంబోధిస్తుండగా... సమంత కూడా నాగ్ మామ అంటూ ప్రేమగా పిలవడం పరిపాటిగా మారింది. అందులో భాగంగానే నాగ్ మామ ట్వీట్ కి కోడలు సమంత.. థ్యాంక్యూ మామా... లవ్ యూ అంటూ ప్రేమగా రీ ట్వీట్ చేసింది. మరి మహానటి మూవీ సూపర్ టాక్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో తన కన్నా ముందొచ్చిన నా పేరు సూర్య కి... ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన మెహబూబాకు చమట్లు పట్టించేస్తుంది.