'నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా' వేడుకలో పవన్ మాటలు కాస్త అతిశయోక్తి అనిపించినా, పవన్ రవితేజ 'నేలటిక్కెట్' వేడుకలో చేసిన కామెంట్స్ మాత్రం నూటికి రెండోందల శాతం కరెక్ట్ అని చెప్పాలి. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఒక వ్యక్తి ఇంత హాస్యం పండిస్తున్నాడంటే ఆ వ్యక్తి మనసులో ఎంతో బాధ, ఆవేదన లేకపోతే హాస్యం రాదు. అందుకే రవితేజ అంటే నాకెంతో ఇష్టం. రవితేజ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాడు. రవితేజ నటునిగా ఎదగడం వెనుక ఎంతో కష్టం ఉంది. ఆ కసిని, కృషిని, కష్టాన్ని అభినందిస్తున్నా. ఎంత మందిలో అయినా రవితేజ సిగ్గు పడకుండా నటించేస్తాడు. నేను అలా నటించలేను. అందుకే రవితేజ నాకు స్ఫూర్తి.
నేను సినిమాలలోకి రానప్పుడు, మద్రాస్ వీధుల్లో తిరుగుతున్నప్పుడే రవితేజని చూశాను. అన్నయ్య చిరంజీవి తర్వాత అంత దగ్గరగా రవితేజని చూసేవాడిని. 'ఆజ్‌కా గూండారాజ్'కి మద్రాస్‌లో ప్రీమియర్ షోకి వెళ్లినప్పుడు రవితేజని చూశాను. అప్పటికీ నేనింకా నటుడిని కాలేదు కాబట్టి రవితేజ గుర్తుపట్టలేదు. అప్పటికే రవితేజ నటుడు కాబట్టి నేను గుర్తించాను అని అన్నారు. దానికి రవితేజ మాట్లాడుతూ, పదేళ్లకిందట నేను ఓ వ్యక్తికి ఫోన్ చేశాను. ఆ వ్యక్తి పక్కనే పవన్‌కళ్యాణ్ ఉన్నాడు. పవన్ నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏమిటంటే... మీరు అంత సిగ్గులేకుండా ఎలా చేస్తారండీ...?అన్నారు. ఆ కాంప్లిమెంట్‌ని ఎప్పటికీ మర్చిపోను.
ఇది వరకు ఇద్దరం బాగానే కలుస్తూ ఉండేవాళ్లం. ఇప్పుడు బిజీ అవ్వడంతో కలవలేకపోతున్నాం. పవన్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అన్నారు. ఈ విషయంలో పవన్ చెప్పింది అక్షరాలా నిజం. రవితేజకి వయసుతో పాటు ఎనర్జీ, తనదైన హాస్యం, టైమింగ్‌లు చూస్తే అదే నిజమనిపిస్తుంది. బహుశా రవితేజకి పవన్ మిస్సయిన చిత్రాలు రావడానికి అది కూడా ఓ కారణమేమో అనిపించకమానదు.