'మహానటి' పేరుతో సావిత్రి బయోపిక్ విడుదలై అత్యద్భుతమైన టాక్‌ని తెచ్చుకుంటోంది. విడుదలకు ముందు శాటిలైట్ బిజినెస్ జరగని ఈ చిత్రాన్ని ఇప్పుడు ఓ చానెల్ ఏకంగా 10కోట్లకు కొనుక్కుంది అంటే ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించనుందో అర్ధమవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లోనూ వీక్‌డేస్‌లో ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్లు సాధించడంతో వీకెండ్‌లో ఏ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుంది అనేది ఆసక్తిగా ఉంది. ఇక ఈచిత్రంలో ఎన్టీఆర్ పాత్రను ఏదో డిజిటల్‌గా అలాఇలా మేనేజ్ చేశారు. నిజంగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రని జూనియర్ చేసి వుంటే మాత్రం ఇక ఈ చిత్రం ఏస్థాయిలో ఉండేదో అనిపిస్తోంది.
ఇక ఏయన్నార్ పాత్రలో ఆయన మనవడు నాగచైతన్య 'దేవదాసు' కాలం నాటి మీసకట్టు, బెల్ బాటమ్ ప్యాంట్స్‌లో తన తాతను అనుకరిస్తున్న సీన్లు కొద్దిగానే అయినా థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ టాపిక్ వచ్చినప్పుడు కూడా రెస్పాన్స్ అదిరిపోతోంది. నాగార్జున తన కెరీర్‌లో ఇప్పటివరకు తన తండ్రిని అనుకరించింది లేదు. కానీ నాగచైతన్యకి మాత్రం ఆ అదృష్టం దక్కింది. ఈ విషయమైన నాగార్జున ట్వీట్ చేశాడు.
తనకి ఈ చిత్రం చూస్తే ఓ తండ్రిగా గర్వంగా ఉందని, మరోవైపు ఏయన్నార్ కుమారుడిగా ఈర్ష్యగా ఉందని కామెంట్ చేశాడు. తన కుమారుడు నాగచైతన్య తన తండ్రి పాత్రను చేయడం, ముఖ్యంగా 'మహానటి'లో ఏయన్నార్ పాత్రని మలచడం చూస్తే ఎంతో ఆనందంగా ఉందని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఇక ఏయన్నార్ జీవితానికి సంబంధించిన విశేషాలను నాని వాయిస్ ఓవర్‌లో రూపొందించి, ఓ వీడియోను రూపొందించడం పట్ల కూడా అక్కినేని అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు.