ఉన్ననాడు ఉన్నదాని విలువ తెలియదు.. అది లేనినాడు ఎందరడిగినా అది చేతికందదు అనే కవి మాటలు అక్షరసత్యాలు. దాసరి ఉన్నంత కాలం తెలుగు సినీ పరిశ్రమకి ఆయన గొప్పతనం తెలియలేదు. తన పనులన్నింటిని పక్కనపెట్టి మరీ ఇండస్ట్రీలో ఏదైనా సమస్య వస్తే తన విలువైన సమయాన్ని కేటాయించి మరి, ఇండస్ట్రీకి చెందిన ప్రతి సమస్యను తనదిలా భావించి తన భుజాల మీదకు ఎత్తుకునే వాడు. వాటిని పెద్దవి కాకుండా ఎంత పెద్ద సమస్యలనైనా తన నాయకత్వ లక్షణాలతో ఫుల్‌స్టాప్ పెట్టేవారు. తన మాట ఎవ్వరూ వినని పరిస్థితి ఆయనకెప్పుడు రాలేదు. అది ఆయనలోని గొప్పనాయకత్వ లక్షణానికి ఉదాహరణ.
కానీ నేడు ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి చిన్న సమస్య కూడా బజారుకెక్కుతోంది. అందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడేవారు లేరు. తమకెందుకు ఆ గొడవ విషయం అని ఎవరికి వారు మౌనంగా ఉండటంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు నడి బజారులో నగ్నంగా నిలుచుని ఉంది. దీనిపై తాజాగా పూరీ జగన్నాథ్ కూడా స్పందించాడు. ఇక దాసరికి పూరీ అంటే ఎంతో ఇష్టం. తన 'బొబ్బిలిపులి' కోర్టు సీన్ తరహాలోనే 'టెంపర్' చిత్రంలోని కోర్టు సీన్‌ని తీసిన పూరీని చూసి దాసరి నా తర్వాత వారసుడు పూరీనే అని ప్రకటించాడు. ఇది తనకి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్‌గా పూరీ పేర్కొంటున్నాడు. నాయకత్వం అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదు. అది స్వతహాగా ఉండాలి. దాసరి లేని లోటు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయనే ఉండి ఉంటే పరిస్థితి ఇంతలా దిగజారేది కాదు... అంటూ తన మనసులోని మాటలను పూరీ బయట పెట్టాడు.
ఇక తాను నమ్మిన వ్యక్తులు మోసం చేయడంతో నడి రోడ్డులో ఉన్నప్పుడు ఏడ్చానని, తర్వాత మరలా పని మీద మనసు పెట్టి పోయింది సంపాదించుకున్నానని తెలిపాడు. ఇక తన కుమారుడి కోసం అంత బడ్జెట్ పెట్టేందుకు ఇతర నిర్మాతలు భయపడి, రిస్క్‌గా భావిస్తారనే ఉద్దేశ్యంతోనే ఆకాష్‌పూరీ నటిస్తున్న 'మెహబూబా' చిత్రాన్ని తానే నిర్మించానని, దీనికోసం నా ఇంటిని ఒకదానిని అమ్మడం కూడా నిజమేనని, అయితే వాటిని సంపాదించుకోవడం, మరలా జీరో నుంచి మొదలుపెట్టడంలో తనకు చాలా సహజమైన విషయంగా పూరీ చెప్పడం చూస్తే ఆయనకు ఈ చిత్రంపై ఉన్న నమ్మకం అర్ధమవుతోంది.