ప్రముఖ నటుడు రాహుల్ రవీంద్రన్ తాజాగా మెగాఫోన్ చేతబట్టి అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్‌తో 'చి..ల..సౌ' అనే చిత్రం తీస్తున్నాడు. చి..ల..సౌ అంటే చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అని మనం సాధారణంగా పెళ్లిపత్రికల్లో చూస్తూ ఉంటాం. 'ఆటాడుకుందాం..రా' తర్వాత ఎంతో గ్యాప్ ఇచ్చి, ఆ డిజాస్టర్‌ని మరిచిపోయి కొంతకాలం తీసుకుని సుశాంత్ హీరోగా చేస్తున్న చిత్రం ఇది. ఇక ఈ చిత్రంలో కొత్తమ్మాయి రుహని శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం టీజర్‌ని విభిన్న చిత్రాల హీరో రానా దగ్గుబాటి విడుదల చేశాడు.
ఇందులో హీరో సుశాంత్ పేరు అర్జున్. ఆయనకు పెళ్లి అంటే ఇష్టం ఉండదు. అందునా ఆజన్మ బ్రహ్మచారి. ఆంజనేయస్వామికి భక్తుడే కాదు.. ఐదు పదుల వయసు దాటినా కూడా ఇంకా బ్యాచ్‌లర్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోన్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ అన్నా కూడా మన హీరోకి ప్రాణం. సల్మాన్ పెళ్లి చేసుకోకుండా జీవితాంంతం ఇలాగే బ్రహ్మచారిగా మిగిలిపోతే ఎంత బావుంటుంది అని హీరో అర్జున్ అలియాస్ సుశాంత్ భావిస్తూ ఉంటాడు. ఇకవైపు సుశాంత్ సల్మాన్ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఆంజనేయస్వామిలా బ్రహ్మచారిగా ఉండాలని ఆయన ఆంజనేయ స్వామికి మొక్కుకుంటూ ఉంటే మరోవైపు తన కుమారుడిని పెళ్లి జరగాలని ఆమె తల్లి కూడా ఆంజనేయ స్వామికి దణ్ణం పెట్టుకుంటోంది.
ఇదేదో చూస్తుంటే పెళ్లికాని, పెళ్లి ఇష్టం లేని ప్రసాద్‌ల స్టోరీని మరోసారి చూపిస్తున్నట్లు అర్ధమవుతోంది. టీజర్ ప్రకారం చూస్తే ఈ చిత్రం ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ ప్రధానంగా రూపొందిందని తెలుస్తోంది. మరి ఈ చిత్రం దర్శకునిగా రాహుల్‌రవీంద్రన్‌కి, హీరో సుశాంత్‌కి ఇద్దరికీ ఎంతో కీలకమనే చెప్పాలి.