ఎన్టీఆర్ లావుగా ఉన్నప్పుడు కూడా స్టెప్స్ ఇరగదీసేవాడు. ఆయన సన్నబడిన తర్వాత 'యమదొంగ' నుంచి 'టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్, జై లవకుశ' చిత్రాలలో తన మూమెంట్‌తో మరింత స్పీడ్ అందుకున్నాడు. ఇక 'టెంపర్' కోసం సిక్స్‌ప్యాక్ చేసి చొక్కా లేకుండా కనిపించిన ఎన్టీఆర్ తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రంలో కూడా సిక్స్‌ప్యాక్ చూపిస్తూ రెయిన్ ఎఫెక్ట్‌లో జరిగే ఫైట్‌ని చొక్కా లేకుండానే చేస్తున్నాడట. ఈ ఫైట్ చిత్రీకరణ కూడా ఇటీవలే రామోజీఫిలింసిటీలో పూర్తి చేశారు. త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది.
ఇక ఈచిత్రంలో ఎన్టీఆర్ రాయలసీమ మరీ ముఖ్యంగా చిత్తూరు యాసతో మాట్లాడనున్నాడని సమాచారం. ఇటీవల నాని నటించిన 'కృష్ణార్జునయుద్దం'లో 'దారి చూడు..దమ్ము చూడు....' అనే పాటను పాడిన పెంచలదాస్.. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చే చిత్రంలో చిత్తూరు యాసతో మరోపాట పాడనున్నాడని సమాచారం. ఇక పెంచల్‌దాస్‌కి చిత్తూరుయాసలో మంచి పట్టు ఉండటంతో త్రివిక్రమ్ కూడా భేషజాలకు పోకుండా పెంచల్‌దాస్ చేతనే ఈ చిత్రం డైలాగ్స్ విషయంలో కూడా సహాయసహకారాలు తీసుకుంటున్నాడని సమాచారం. ఇక బాలీవుడ్ లో స్టెప్స్ ఇరగదీస్తాడనే పేరున్న 'హృతిక్‌రోషన్'తో 'మొహంజదారో', బన్నీతో చేసిన 'డిజె', ఇటీవల వచ్చిన 'రంగస్థలం' చిత్రంలో రామ్‌చరణ్ సరసన వారికి ధీటుగా స్టెప్స్ వేసిన పూజాహెగ్డే ఎన్టీఆర్-త్రివిక్రమ్ చిత్రాల కోసం ఎన్టీఆర్‌కి ధీటుగా నర్తించేందుకు డ్యాన్స్‌ప్రాక్టీసు చేస్తోందని తెలుస్తుంది. బన్నీ, రామ్‌చరణ్‌లు కూడా బాగా డ్యాన్స్ చేసేవారే. వారి చిత్రాలలో మెప్పించిన పూజా మరి ఎన్టీఆర్ చిత్రంలో ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి. ఆ తర్వాత రెండు చిత్రాలైన మహేష్ 25వ చిత్రం, ప్రభాస్-జిల్‌రాధాకృష్ణల విషయంలో ఈమెకి తిరుగేలేదు. ఎందుకంటే మహేష్, ప్రభాస్‌లు మరీ రామ్‌చరణ్, బన్నీ, ఎన్టీఆర్ వంటి డ్యాన్సర్లు ఏమీకాదు.
ఇక పవన్‌తో త్రివిక్రమ్ చిత్రం చేసినప్పుడు దానికి టైటిల్ 'అజ్ఞాతవాసి' అని బాగా ప్రచారం జరిగింది. అదే టైటిల్‌ను త్రివిక్రమ్ ఫైనల్ చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్‌తో ఆయన చేయబోయే చిత్రానికి 'అసామాన్యుడు' టైటిల్‌ని పరిశీలిస్తున్నారని సమాచారం. మరి ఎన్టీఆర్ అభిమానులు రెస్పాన్స్‌పై ఈ చిత్రానికి అదే టైటిల్ పెడతారా? మార్చుతారా? అనేది ఆధారపడి ఉంది!