అక్కినేని కోడలు సమంత ప్రస్తుతం ఆ ఇంటికోడలిగానే ఉండటంతో పాటు సినిమాలలోనూ టాప్‌స్టార్ స్థానాన్నే నిలబెట్టుకుంటూ ఉంది. ఇక గత కొంతకాలంగా హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు కాస్టింగ్ కౌచ్ విషయంలో రాద్దాంతం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా శ్రీరెడ్డి ఇష్యూతో తెలుగు పరిశ్రమ అతలాకుతలం అయిపోయింది. దీనిపై తాజాగా సమంత స్పందించింది.
సినిమా ఇండస్ట్రీలో నీచులు ఉన్నట్లే మంచి వారు కూడా ఉన్నారు. ఇక నా వరకు వస్తే నా మొదటి చిత్రమే సూపర్‌హిట్ కావడంతో నాకు అలాంటి సమస్యలు ఎదురుకాలేదు. ఇప్పుడు దీనిపై కొత్త చట్టాలను కూడా రూపొందిస్తున్నారు. దాని వల్ల అయినా ఆయా నీచులు ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నాను. అలాంటి చీడ పురుగులను తరిమేస్తే ప్రపంచంలో సినీ పరిశ్రమని మించిన మంచి పరిశ్రమ ఉండదనే చెప్పాలి.
ఇక నేను ప్రస్తుతం 'మహానటి'తో పాటు విశాల్ హీరోగా మిత్రన్ దర్శకత్వంలో 'ఇరుంబుదిరై' చిత్రం చేస్తున్నాను. 'మహానటి' చిత్రం తమిళంలో 'నడిగైయార్ తిలగం'గా మే 9తేదీన విడుదల కానుంది. ఇక తమిళంలో 'ఇరుంబుదిరై' కూడా తెలుగులో 'అభిమన్యుడు' పేరుతో మే11న విడుదల కానుంది. ఇక నేను సామాన్యంగా కొత్త దర్శకులతో పెద్దగా కంఫర్ట్‌గా ఫీల్ కాను. కానీ మిత్రన్ విషయంలో మాత్రం ఆయన పనితీరు చూసి ఆశ్చర్యపోయాను. ఆయన ఈ చిత్రం కథ చెప్పినప్పుడు మనకి తెలియకుండానే ఇంటర్‌నెట్, సోషల్‌మీడియాలలో ఇంత ఘోరాలు జరుగుతాయా? అని భయమేసింది. ఈ కథ విన్న తర్వాత సెల్‌ఫోన్ పట్టుకోవడానికి కూడా భయమేసింది.
ఈ చిత్రంలోని ఘటనలు నా జీవితంలో జరగకపోయినా కూడా నా స్నేహితుల జీవితాలలో జరిగాయి. ఇక ఈ చిత్రానికి నేను డబ్బింగ్ చెప్పడానికి నిరాకరించాను అంటున్నారు.కానీ అది నిజంకాదు. సమ్మె తర్వాత 'ఇరుంబుదిరై' విడుదల అవుతోంది. అదే సమయంలో నేను 'మహానటి' అదేనండీ 'నడిగైయార్‌తిలగం' షూటింగ్‌లో బిజీగా ఉండటం, విడుదల దగ్గర పడుతున్న సమయంలో షూటింగ్‌లో బిజిబిజీగా ఉండటం వల్ల మాత్రమే డబ్బింగ్ చెప్పలేకపోయాను అని చెప్పుకొచ్చింది.