'మహానటి' చిత్రంలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. ఇంతకు ముందు 'అజ్ఞాతవాసి'లో కూడా డబ్బింగ్ చెప్పాను. కానీ అదివేరు.. ఈ 'మహానటి' వేరు. డబ్బింగ్ పరంగా ఈ చిత్రంలో ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చింది 'మహానటి'. నాకు 'నాన.. నాన' అని పిలవడం అలవాటు. కానీ ఈ చిత్రంలో 'నాన్న, నాన్నా'అని ఖచ్చితంగా చెప్పాలి. ఇక నేను 'గురుగారు' అంటాను. కానీ ఈ చిత్రంలో 'గురువుగారు' అని స్పష్టంగా పలకాలి. ఇలా స్వచ్చమైన తెలుగు మాటలు పలికాను. నటిస్తున్నప్పుడు మాటల్లో ఇబ్బందేమీ రాలేదు. కానీ డబ్బింగ్ విషయానికి వచ్చే సరికి ప్రతిదీ పక్కాగా ఉండాల్సిందే. అందుకోసం ఎన్నో టేక్‌లు తీసుకున్నాను. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇది కదా అసలైన అచ్చమైన తెలుగు అనిపించింది.
సాయిమాధవ్ బుర్రా, శ్రీనివాస్‌లు నాచేత డబ్బింగ్ చెప్పించారు. కేవలం డబ్బింగ్ కోసమే 12రోజుల సమయం తీసుకున్నాను. నేను బాలనటిగా చేసేటప్పుడు ఊటీలో మోహన్‌బాబుగారిని చిన్నతనంలో కలుసుకున్నాను. ఆయన వద్దకు వెళ్లి ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాను. అది ఇప్పటికీ నా దగ్గర ఉంది. 'మహానటి' కోసం ఆయన సెట్స్‌కి వచ్చినప్పుడు 'నా చిన్నప్పుడు మీరు ఇచ్చిన ఆటోగ్రాఫ్ సార్' అని ఆయనకు చూపించాను. ఇది ఎప్పుడు తీసుకున్నావని అడిగారు. 12ఏళ్ల కిందట తీసుకున్నది అని చెప్పాను.
దానికి ఆయన నాకు వయసు అయిపోయిందని గుర్తు చేస్తున్నావు కదూ.. అన్నారు. అలా అంటూ నవ్వేశారు. అలాంటి నటునితో కలిసి పనిచేయడం అద్భుతం అనిపించింది. దుల్కర్ సల్మాన్, నేను ఇద్దరం చిన్ననాటి నుంచి స్నేహితులం. ఆయనకు తెలుగు కొత్త కాబట్టి మేం సంభాషణలను తమిళం, మలయాళంలో చెప్పుకుని, చర్చించుకుని నటించే వాళ్లమని 'మహానటి' గా నటిస్తున్న కీర్తిసురేష్ చెప్పుకొచ్చింది!