మొదట్లో సావిత్రి మీద 'మహానటి' అనే బయోపిక్ వస్తుందనగానే సావిత్రి జీవితం అంటే ఏముంది? మొత్తం ఏడుపు, సెంటిమెంట్, ట్రాజెడీలే కదా అని పలువురు అభిప్రాయపడ్డారు. కానీ సావిత్రి జీవితంలోని ఆనందకరమైన సన్నివేశాలను, ముఖ్యంగా ఆమె ప్రేమకు ఇచ్చే విలువను నాగ్ అశ్విన్ అద్భుతంగా చూపించనున్నాడని, టీజర్, లుక్స్ విడుదల చేసిన తర్వాత అర్ధమవుతోంది. మొదట్లో కీర్తిసురేష్ ఎంపికని తప్పు పట్టిన వారే నేడు ఆమె తప్ప ఆ పాత్రలో ఎవ్వరూ అంతలా ఒదగలేరని అంటున్నారు. ఇక 'మాయాబజార్' చిత్రాన్ని చూడని తెలుగు సినీ ప్రేమికుడు ఉండడంటే అది అతిశయోక్తికాదు. ముఖ్యంగా ఇందులో మాయా దర్పణం సీన్‌లో శశిరేఖగా సావిత్రి చూపిన అభినయం అత్యద్భుతం.
ఇక తాజాగా ఈ మాయా దర్పణానికి చెందిన సీన్ వంటి స్టిల్‌ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో గబుక్కున కీర్తిసురేష్‌ని చూస్తే సావిత్రియేమో అనే భావన కలగడం విశేషం. అంతలా కట్టు, బొట్టు, హావభావాలతో ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఇక ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సావిత్రిగా నటిస్తున్న కీర్తిసురేష్ కనిపిస్తున్న స్టిల్‌ని, సావిత్రి స్టిల్‌ని పక్కనపక్కనే పెట్టి నెటిజన్లు వీటిని పోస్ట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం రూపకల్పనలో దర్శకుడు నాగ్ అశ్విన్‌కి సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి కథా పరంగానే గాక వివిధ రకాలుగా ఎంతో సహాయం చేసిందట.
సావిత్రి కూతురు తాజాగా మాట్లాడుతూ.. ఇప్పుడు కెఎఫ్‌సి చికెన్ తరహాలోనే ఆనాడే సావిత్రి అద్భుతంగా నాన్ వెజ్‌ని వండేదట. ఇక ఆమెకి పీతల కూర అంటే చచ్చేంత ఇష్టమని, తన తల్లి డయాబెటిక్ పేషెంట్, ఇతర వ్యాధుల వల్ల ఎన్నో రోజులు కోమాలో ఉందని, ఆ రోజుల్లో తమ తండ్రి ఆమెని పట్టించుకోలేదన్న మాట నిజం కాదని, ఆయన బాధపడని రోజు లేదంటే ఆమె కూతురు చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈనెల 9వ తేదీన విడుదల కానున్న చిత్రంపై పలువురికి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను ఎవరు చేస్తున్నారు? అనే అంశం మాత్రం అందరినీ ఉత్సుకతకు గురిచేస్తోంది.