పవన్ మనసు నిలకడగా ఉండదని, ఆయనది చంచలస్వభావమని ఇప్పటికే అందరికీ అర్ధమైంది. ఇక తాజాగా పవన్ మీడియా సమావేశం పెట్టి 'దేవ్' అనే వ్యక్తిని తమ రాజకీయ పార్టీ వ్యూహకర్తగా చెప్పుకొచ్చాడు. కానీ జనాలకు ఈ దేవ్ ఎవరో తెలియడం లేదు. గూగుల్‌లో సెర్చ్ చేస్తే భిన్న విషయాలు, బిన్నమైన ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఇక ఈ దేవ్ తనకు అసలు తెలుగేరాదన్నట్లు మాట్లాడుతున్నాడు. తానేదో విదేశాల నుంచి లేదా నార్త్ ఇండియా నుంచి ఇప్పుడే విమానం దిగిన వ్యక్తిలా ఫోజులిస్తున్నాడు. కానీ దేవ్ విషయంలో పలు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఆయన ఓ చోటా మోటా లీడర్ అని తెలుస్తోంది. ఈయన ఎన్నికల్లో బిజెపికి ప్రచారం చేసి పలు సభలు, టివి డిబేట్‌లో పాల్గొన్న వ్యక్తి అని సమాచారం.
ఇక నేడు పలు పార్టీలకు వ్యూహకర్తలు ఉంటున్నారు. అలాంటి రాజకీయ వ్యూహకర్త తనకు ఉండాలని పవన్ భావించడంలో తప్పులేదు. పార్టీ వ్యూహకర్తలు కూడా ఒక్కోసారి ఒక్కో పార్టీకి పనిచేస్తూ ఉంటారు. ప్రస్తుతం వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్‌కిషోర్ కాంగ్రెస్‌కి, బిజెపిలు రెండింటికి పనిచేశాడు. కానీ ఆయన ఓ వ్యూహకర్తగా ఉన్నాడే గానీ ఏ రాజకీయ పార్టీ కండువా కూడా కప్పుకోలేదు. కానీ ఈదేవ్ మాత్రం బిజెపి కండువా కప్పుకుని మరీ ప్రచారం చేశాడు. ఇక ఈయన తెలుగు రాదని చెబుతున్న మాటలు కూడా నిజం కాదు. కానీ ఆయన స్పష్టంగా తెలుగులో మాట్లాడిన పలు ప్రసంగాలు యూట్యూబ్‌లో దర్శనమిస్తున్నాయి. మరి ఈ విషయంలో పవన్ మోసపోయాడా? లేక అయన అడుగులు బిజెపికి అనుగుణంగా ఉండనున్నాయా? కావాలనే పవన్ బిజెపి వ్యక్తిని వ్యూహకర్తగా పెట్టుకున్నాడా? వంటి పలు సందేహాలు వస్తున్నాయి.
ఇక ఈ దేవ్ పేరు వాసుదేవ్. ఈయన సమైక్యాంధ్రలో ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర రాజనర్సింహ సతీమణికి సోదరుడు వరస అవుతాడని కూడా ప్రచారం జరుగుతోంది. దేవ్ నివాసం కూడా హైదరాబాద్‌లోని ఖైరతా బాద్ ప్రాంతానికి చెందిన చింతల్‌బస్తీలో ఉందని తెలుస్తోంది. ఈయన బిజెపికి బిగ్రేడ్‌లో పనిచేశాడని, ఈయన తెలంగాణ బిజెపినేత కిషన్‌రెడ్డికి మంచిసన్నిహితునిగా చెబుతున్నారు. ఇక మరో విషయం ఏమిటంటే. మీడియాని బహిష్కరించాలని చెబుతున్న పవన్ మీడియా సమావేశం పెట్ట్టి, ప్రెస్‌నోట్‌ని రిలీజ్‌చేస్తూ ఏపిలోని మొత్తం 175నియోజకవర్గాలలో పోటీ చేస్తామని, తెలంగాణ విషయంలో ఆగష్టులో తెలుపుతామని చెప్పాడు.
నిజంగా పవన్‌కి మీడియాతో ఇబ్బందులు గానీ లేకపోయిఉంటే చానెల్స్ వీటిపై డిబేట్‌లు, చర్చలు నిర్వహించి, విస్తృత ప్రచారం చేసిఉండేవి. కానీ నేడు మాత్రం ఆ మీడియా సంస్థలు ఈ ప్రెస్‌నోట్‌ని కనీస ప్రాముఖ్యత లేకుండా చూశాయి. దీనితో మీడియాతో పెట్టుకుంటే ఎంత ఇబ్బందో ఇప్పుడు డైరెక్ట్‌గా పవన్‌కి అర్ధమైందని వార్తలు వస్తున్నాయి. ఆయన ఆరోపణలు చేసిన చానెల్స్ ఆయన విషయాలను ఎంతో లైట్‌గా తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది....!