ఇంతకాలం జరిగిన ఎన్నికల అన్నింటిలో తాము విజయపరంపర సాగిస్తున్నామని బిజెపి చెప్పుకుంటోందని, ఇక నుంచి మాత్రం అన్ని ఎన్నికల్లోనూ బిజెపికి పరాజయాలే పలకరిస్తాయని విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ తెలిపాడు. బిజెపి పతనం కర్ణాటక నుంచే మొదలవుతుందని, తమిళనాట తమిళుల కోపం చూసి భయపడి మోదీ హెలికాప్టర్‌లో వెళ్లారని ఆయన ఎద్దేవా చేశాడు. గతంలో కర్ణాటకలో బిజెపి పాలనలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారని, అలాంటి బిజెపి ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మారితే మాత్రం ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు వంటి వ్యాఖ్యలు చేస్తోందని మండిపడ్డాడు.
ప్రచారంలో దూసుకుపోయే ప్రధాని కర్ణాటక ఎన్నికల్లో కేవలం ఐదు రోజులకే పరిమితం చేయడంతో బిజెపి బలం ఏమిటో బయటపడుతోందని ఆయన విమర్శించాడు. 2019 ఎన్నికల్లో కూడా బిజెపి ఘోరంగా ఓడిపోతుందని, ఈసారి మోదీ ప్రధాని కాలేరని ఆయన జోస్యం చెప్పారు. కర్ణాటక షెడ్యూల్ విడుదలైన కొంతకాలం వరకు బిజెపి హవా ఉందని, కానీ ఇప్పుడు ఆ హవాలేదు. మోదీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసహనం పెరిగిపోయింది. బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎన్నిఅరాచకాలు జరుగుతున్నాయో మనం రోజు చూస్తేనే ఉన్నామని తెలిపాడు. కర్ణాటక ఎన్నికల్లో బిజెపిని చిత్తుగా ఓడించమని తాను ప్రజలను కోరుతున్నానని అన్నాడు.
ఇక ఆయన కాస్టింగ్‌కౌచ్‌పై కూడా స్పందించాడు. శ్రీరెడ్డి వ్యవహారంలో ఇండస్ట్రీ వారు అసలు ఇండస్ట్రీలో కాస్టింగ్‌కౌచ్ లేన్నట్లు, మీడియాపై ఆంక్షలు విధించడానికి సిద్దం అవుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ.. శ్రీరెడ్డి ఆవేదనను ఇండస్ట్రీ ఎందుకు పట్టించుకోవడం లేదు? ఒక మహిళ ఏడుస్తున్నప్పుడు ఆమె బాధ ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎవరు ఆరోపణలు చేస్తున్నారు? ఏ రీతిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనే దాని బదులు ఆమె ఏమంటోంది? అనేదే ముఖ్యం.
నిజాలేంటి? ఇండస్ట్రీలో నిజంగా ఇలాంటివి జరగడం లేదా? అని ఆలోచించి సమస్యకు పరిష్కారం కనుగొనాలి. అంతే తప్ప ఆరోపణలు చేసిన వ్యక్తి వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే ప్రయత్నం మంచిది కాదు. కాస్టింగ్‌కౌచ్ అనేది పెద్ద సమస్య. నిజంగా నేడు మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. మీడియా మీద ఆంక్షలు విధించడం ద్వారా ఇండస్ట్రీ ఏం సాధించాలనుకుంటోంది? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.