20 రోజుల వ్యవధిలో రెండు బ్లాక్‌బస్టర్స్‌కి టాలీవుడ్ వేదికగా మారింది. ఇక కలెక్షన్ల విషయంలో మన దేశంలో చెప్పే వసూళ్లని మనం ప్రామాణికంగా తీసుకోలేం. ఎందుకంటే ఇక్కడ క్రేజ్ కోసం పెంచి అయినా చెబుతారు. ఇన్‌కం ట్యాక్స్ ఇబ్బంది వస్తుంది అంటే తగ్గించైనా చెబుతారు. కాబట్టి వీటిని నమ్మడం కష్టం. మొన్న 'నా పేరు సూర్య...నా ఇల్లు ఇండియా' చిత్రం ప్రీరిలీజ్ వేడుకలో రామ్‌చరణ్ ప్రపంచంలో అవినీతి లేని పరిశ్రమ సినిమా ఇండస్ట్రీనే అని, తాము ఎంతో కష్టపడతామని, ఎన్నో గాయాల పాలవుతామని చెప్పాడు. ఎవరి వృత్తిలో వారికి వారికి తగ్గ కష్టాలు ఉంటాయి. దేశంలో ఇన్‌కం ట్యాక్స్‌ని బాగా తప్పుడు లెక్కలతో ఎగ్గోట్టే పరిశ్రమ ఉందంటే మొదటి స్థానం సినీ రంగానిదే అని పలువురు చెబుతారు. వారు తీసుకునే పారితోషికాలకు, వారు కట్టే ఇన్‌కం ట్యాక్స్‌లకి సంబంధమే ఉండదు.
ఇక ఓవర్‌సీస్ విషయానికి వస్తే 'రంగస్థలం' చిత్రం 3.21మిలియన్ డాలర్స్ సాధించుకోగా, 'భరత్ అనే నేను' చిత్రం 3.15 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. మొత్తంగా ఈ రెండు చిత్రాలు ఓవర్‌సీస్‌లో 3.5 మిలియన్ డాలర్లు సాధించడం పక్కా అని చెప్పవచ్చు. ఇక 'రంగస్థలం'తో పోల్చుకుంటే 'భరత్ అనే నేను'కే పెద్ద స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. కేటీఆర్‌తో ఇంటరాక్షన్ కూడా నైజాంలో ఈ చిత్రం బాగా కలెక్షన్లు సాధించడానికి దోహదపడుతోంది. కానీ ఆ స్థాయిలో 'రంగస్థలం' ప్రమోషన్ల ఊపు లేకపోవడం గమనార్హం.