వ్యక్తులు, పార్టీలపై సెటైర్లు వేస్తూ, ప్రత్యర్ధులపై పంచ్‌లు వేసి తమ రాజకీయ అవసరాలకు తగ్గట్లు వ్యక్తిగతంగా కొందరిని టార్గెట్ చేయడం, కేవలం కొన్ని పార్టీలనే లక్ష్యంగా ఎంచుకోవడం ఎన్నో ఏళ్లుగా వస్తోంది. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణ ఆయనపై తీసిన వ్యంగ్యాస్త్రాలైనా, లేక బాలకృష్ణ సినిమాలలో వినిపించే మా వంశం, మా తండ్రి అంటూ బాలయ్య వేసే సెటైర్లు అన్ని ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూనే ఉంటాయి. ఇక బాలకృష్ణ నుంచి మోహన్‌బాబు వరకు అందరిదీ ఇదే వరస. వారు ఏ రాజకీయ పరమైన డైలాగ్ పేల్చినా మనకు ఎంత లాభం, పక్కవాడిని టార్గెట్ చేయడం వల్ల ఎంత కలిసి వస్తుంది అనే ఆలోచిస్తారు. ఏ పార్టీని టార్గెట్ చేయలేదని చెబుతూనే ఇటీవల వచ్చిన 'గాయత్రి' చిత్రంలో బీకాంలో ఫిజిక్స్ వంటివన్నీ టిడిపి టార్గెట్ చేస్తూ, వైసీపీకి అనుకూలంగా ఉన్న డైలాగులే కావడం గమనార్హం. కానీ సమాజం కోణంలో ఏది మంచి? ఏది చెడు? అని విమర్శనాత్మగా, వ్యవస్థలోని లోపాలను ఎండగట్టే చిత్రాలు చాలా అరుదు.
ఈ విషయంలో ఇప్పటివరకు కేవలం ఆర్.నారాయణమూర్తి మాత్రమే తనవంతు బాధ్యతగా సమాజంలో జరుగుతున్న దోపిడీలను చూపిస్తున్నాడు. ఇక కార్మికులకు కర్షకుల పక్షపాతిగా నేడు ఆర్.నారాయణమూర్తి, నాడు మాదాల రంగారావు, టి.కృష్ణ, ముత్యాల సుబ్బయ్య, కోడిరామకృష్ణ వంటి వారు ఇప్పుడు తక్కువైపోతున్నారు. ఇక నాడు దాసరి కూడా వ్యవస్థపై సంధించే అస్త్రాలుగా 'ఎమ్మెల్యే ఏడుకొండలు, ఓసేయ్‌రాములమ్మ, ఓరేయ్ రిక్షా' వంటి చిత్రాలు తీశారు. కానీ నేడు టి.కృష్ణ వంటి దర్శకులు ఎవరూ లేరా? అని ప్రశ్నించుకుంటే నేటి వ్యవస్థలోని లోపాలను గురించి రాజకీయ పార్టీలను వ్యక్తిగతంగా టార్గెట్ చేయకుండా సమాజంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సమస్యలుగా మిగిలిపోతున్న నేటి ప్రజాస్వామ్య వింతపోకడలు, సమాజంలోని వ్యక్తుల బరువు బాధ్యతలు, సమాజం పట్ల వారి దృక్పధంలో రావాల్సిన మార్పులు గురించి కొరటాల తీస్తున్న చిత్రాలకు హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు.
ఇక ఈ విషయంపై కొరటాల శివ స్పందిస్తూ, నేను సినిమా తీసేటప్పుడు ఎవరిని బాధ పెట్టకూడదని అనుకుంటాను. ఒక వ్యక్తి మీద సెటైర్ వేసి టార్గెట్ చేయాలనుకునే చీప్ మెంటాలిటీ నాది కాదు. అలాంటి మైలేజ్ నాకవసరం లేదు. జనాలను ప్రభావితం చేయాలి తప్ప రాజకీయ నాయకులను విమర్శించాలనేది నా ఉద్దేశ్యంగా ఎప్పుడు ఉండదు. ఒక వ్యక్తిపై సినిమా తీసే కన్నా... ఓ వ్యవస్థపై సినిమా తీసేందుకే నేను ఇష్టపడతాను... అని చెప్పుకొచ్చాడు.