ప్రతి ఒక్కరు అపజయాలు ఎదురయినప్పుడు కూడా నిబ్బరంగా ఉండాలని చెబుతూ ఉంటారు. కష్టనష్టాలు వచ్చినప్పుడే విజయంలోని రుచి తెలుస్తుందని చెబుతారు. ఇలా వ్యక్తిత్వ వికాసాల గురించి చెప్పేవారు కూడా తమకంటూ కష్టమొస్తే బోరుమంటారు. అంటే ఫ్లాప్‌లను కూడా తట్టుకోవడం అనేది చెప్పినంత సులభం కాదు ఆచరించడం. ఇక మహేష్‌బాబు విషయానికి వస్తే ఆయన 'భరత్ అనే నేను' ముందు రెండు భారీ డిజాస్టర్స్ మూటగట్టుకున్నాడు. ఇక అంతకు ముందు కూడా ఆగడు, 1(నేనొక్కడినే) పరాజయాలు బాగా ఇబ్బంది పెట్టాయి. అలాంటి సమయంలో కొరటాల శివ శ్రీమంతుడుతో ఇండస్ట్రీ హిట్‌ని అందించాడు. మరలా 'బ్రహ్మోత్సవం, స్పైడర్'ల డిజాస్టర్స్ తర్వాత 'భరత్ అనే నేను' చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.
ఇక ఇంతకు ముందు ఏం మాట్లాడాలన్నా తెగ మొహమాట పడిపోయే మహేష్ తాజాగా కేటీఆర్‌తో కలిసి చేసిన ఇంటరాక్షన్ కార్యక్రమంలోనే కాదు. ఈ చిత్రం విజయ వేడుకల్లో కూడా సుమ నుంచి మైక్ తీసుకుని నాలుగైదు నిమిషాలు అనర్ఘళంగా స్పీచ్ ఇచ్చాడు. ఇక తన తల్లి బర్త్‌డే కానుకగా మొదలైన 'భరత్ అనే నేను' ప్రభంజనం తన తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ బర్త్‌డే అయిన మే 31 వరకు సాగాలని అభిలాషించి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్నాడు.
ఇక గతంలో బ్లూ లేదా బ్లాక్ కలర్ షర్ట్స్ మాత్రమే వేసిన ఆయన ఇప్పుడు టీ షర్ట్స్‌లో కూడా దర్శనమిస్తున్నాడు. భవిష్యత్తుపై ఎంతో నమ్మకంగా తన లాంగ్వేజ్‌లోనూ, బాడీలాంగ్వేజ్‌లోనూ బాగా తేడా కనిపిస్తూ, ఆయనలో నూతన ఉత్తేజం నిండుకుని ఉంది.ఇక ఈయన ఇక ప్రయోగాలు చేయను. అభిమానులకు నచ్చేచిత్రాలు చేస్తాను. ప్రయోగాలు చేసి చేసి అలిసిపోయానని చెప్పాడు. అంటే రవితేజ టైప్‌లో మాట్లాడాడు. నిజానికి ఇప్పుడు బ్లాక్‌బస్టర్ అయిన 'భరత్ అనే నేను' చిత్రం కూడా ఒకరకంగా ప్రయోగమే. గతంలో ఆయన చేసిన 'ఆగడు, బ్రహ్మోత్సవం' వంటివి కమర్షియల్ చిత్రాలే అయినా అవి సరిగా ఆడలేదు. ప్రేక్షకులు కొత్త తరహా చిత్రాలనే ఆదరిస్తున్నారు. కాబట్టి ఇక మహేష్ కూడా అభిమానులకు నచ్చిన చిత్రాలే చేస్తానని చెప్పకుండా వైవిధ్యభరితమైన చిత్రాలలో మాత్రమే నటించి మెప్పించాలని కోరుకుందాం..!