ఇప్పటివరకు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ త్వరలో తాను కేంద్ర రాజకీయాలలో చురుకుగా మారి వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని తన కుమారుడు కేటీఆర్‌కి కట్టబట్టెనున్నాడని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఆయన బిజెపి, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా మూడో ఫ్రంట్ తరహాలో ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్‌కి ముందడుగు వేస్తున్నాడు. నిజంగా జాతీయ రాజకీయ నాయకుల్లో జయలలిత మరణం తర్వాత కేవలం మమతా బెనర్జీ, చంద్రబాబునాయుడులకే మూడో ఫ్రంట్‌ని నడిపే సామర్ద్యం, అందరితో రాజకీయ పరిచయాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే చంద్రబాబు కూడా తృతీయ ఫ్రంట్ అంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం మొదటి సారిగా ఓ చిన్న రాష్ట్రానికి చెందిన కేసీఆర్‌కి అనుభవం గానీ సామర్ధ్యం కానీ చాలవు. ఈ విషయంలో చంద్రబాబు, మమతా బెనర్జీలే కీలకం అయ్యే పరిస్థితి ఉంది.
ఇక కేసీఆర్ ఆమధ్య కోల్‌కత్తా వెళ్లి మరీ మమతాబెనర్జీని కలిసి వచ్చాడు. ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారే గానీ కేసీఆర్ గురించి పెద్దగా మమతా పట్టించుకోలేదు. కేసీఆర్ గురించి ఉమ్మడి ప్రెస్‌మీట్‌ని కూడా ఏర్పాటు చేయలేదు. ఇక తాజాగా కేసీఆర్ తమిళనాడుకి వెళ్లాడు. ఇప్పటివరకు యూపీఏలో భాగస్వామిగా ఉన్న డీఎంకే నేతలైన కరుణానిధి, స్టాలిన్‌లను ఆయన కలుసుకున్నాడు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ, దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి కట్టుగా రావాలని, ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం అయి కేంద్రంలో కీలకంగా మారితేనే రాష్ట్రాలకు మరింత అధికారం, బలం వస్తాయని చెప్పాడు.
ఇక తాను చంద్రబాబుని కూడా కలుస్తానని, మేమిద్దరం ఏడు ఏళ్లు కలిసి పనిచేశాం. త్వరలో చంద్రబాబుతో ఈ విషయంలో కలిసి మాట్లాడుతాను అని చెప్పాడు. కానీ ప్రస్తుతం చంద్రబాబు మాత్రం రజనీ, జెడిఎస్, మమతాబెనర్జీ వంటి వారితో ఆల్‌రెడీ టచ్‌లో ఉన్నాడని సమాచారం. ఇక ఈ ఫ్రంట్‌లు ఏర్పాటు కావడం ఎన్డీఏ, యూపీలకే ప్లస్ అవుతుంది. కాబట్టి కేసీఆర్ నాయకత్వంలో బాబు నడవాలా? లేక బాబు వెనక కేసీఆర్ నడుస్తాడా? అనేది కాలమే నిర్ణయించాలి.