తాజాగా 'భరత్ అనే నేను' చిత్రం చూసిన తెలంగాణ ఐటి, మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ దానిపై పొగడ్తల వర్షం కురిపించడమే కాదు... 'విజన్ ఫర్ ఎ బెటర్ టుమారో' అనే ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. ఈ చిత్రం నా జీవితానికి ఎంతో దగ్గరగా ఉంది. ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి కావాలంటే కాలేరు. మొత్తం మన దేశంలో ఉన్నవి 29 రాష్ట్రాలే. కాబట్టి 29 మందే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఇక ప్రతి వ్యక్తి భరత్‌లాగా నేను బాధ్యతతో ఉండాలి. నాకిచ్చిన బాధ్యతను నిర్వర్తించాలి అని భావిస్తే కనీసం ఒక శాతం మార్పు వచ్చినా అది అద్భుతమే. ఇక నేను మహేష్‌లా మారాలంటే నేను నా ఫ్యామిలీతో కలిసి మహేష్‌లా తరచు వెకేషన్స్‌కి వెళ్లాలి. మహేష్‌ని చూసినప్పుడల్లా నా భార్య, పిల్లలు మహేష్‌లా మమ్మల్ని ఎందుకు అన్ని దేశాలకు వెకేషన్స్‌కి తీసుకెళ్లరు అని అడుగుతుంటారు. ఇక నేను మహేష్‌లా మారనంటూ ఎవ్వరూ చేయని ఓ స్పెషల్ లుక్‌లో కనిపిస్తాను అని అన్నాడు.
దానికి మహేష్ మీరు చెప్పిన లుక్‌లోనే నేను నా తదుపరి చిత్రంలో కనిపిస్తానని అన్నాడు. ఇక మీడియో పోతున్న వైఖరి, తాము వారి వల్ల ఎన్ని బాధలు పడుతున్నామో కూడా ఇందులో అద్భుతంగా చూపించారు. బహుశా మీడియా కాస్త విపరీత పోకడ పోతోంది. బహుశా కుక్క మనిషిని కరిస్తే అది న్యూస్‌కాదు.. మనషే కుక్కను కరిస్తే అది వార్త అనేది మీడియా ఉద్దేశ్యం అయి ఉండవచ్చు. ఇక ఇందులో ఫోర్ ఎస్టేట్స్ ఎంత బాగా ఉండాలో బాగా చెప్పారు. మీరు చెప్పిన జవాబుదారీతనం నాకు నచ్చింది. మనల్ని ఎన్నుకున్న ప్రజలకు మనం జవాబుదారీ తనంగా ఉండాలి. భారీగా కరెంట్‌ని ఉత్పత్తి చేసే దేశంగా పేరున్నా ఇప్పటికీ విద్యుత్‌లేని గ్రామాలున్నాయి. జీవనదులు ఉన్నా గుక్కెడు మంచినీటి కోసం కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితులున్నాయి. సినిమాలో మీరు లోకల్ గవర్నెన్స్ గురించి చెప్పిన విధానం బాగుంది. త్వరలో కేసీఆర్ గారు దీనిని తెలంగాణలో ప్రారంభిస్తారు అని చెప్పారు కేటీఆర్.
ఇక ఈ చిత్రం కథ చెప్పేటప్పుడు కొరటాల శివ కేవలం ఇది లవ్‌స్టోరీ అని చెప్పాడు. తర్వాత ఐదు గంటలు కధను వివరించాడు. ప్రేమ అంటే యువతి యువకుల ప్రేమే కానవసరం లేదు. తన బాధ్యతలని ప్రేమించి, తాను నమ్మిన సిద్దాంతం కోసం రాజీనామా చేసి, మరలా తనను ప్రేమించిన ప్రజలను ప్రేమించడం కూడా ఓ ప్రేమకథే అని మహేష్ చెప్పగా, కేటీఆర్ చాలా బాగా చెప్పారు. ఇది ఖచ్చితంగా ప్రేమకథే అని అన్నారు. ఇక మహేష్ మాట్లాడుతూ, ఈ చిత్రం కేటీఆర్ చూస్తున్నప్పుడు ఎంతో టెన్షన్‌గా ఫీలయ్యాను దానికి కారణం ఆయన 'ఆగడు' సినిమా చూసి మొహమాటం లేకుండా 'స్టాప్ డూయింగ్ నాన్సెస్ లైక్ దిస్' అని కుండబద్దలు కొట్టేలా చెప్పారు. ఆయన సినిమా బాగుంటేనే బాగుందని చెబుతారు. చాలా ముక్కుసూటి మనిషి అని మహేష్ వివరించాడు...!