బ్రహ్మానందం అంటే అద్భుత కమెడియన్. ఈయన దాదాపు మూడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలాడు. కానీ గత మూడేళ్లుగా మాత్రం ఆయన పెద్దగా కనిపించడం లేదు. తాజాగా ఆయన మంచు విష్ణుతో కలిసి జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో 'ఆచారి అమెరికా యాత్ర'లో కీలకమైన పాత్ర చేసినా పెద్దగా నవ్వించలేకపోయాడు. మరి ఈయన 'ఆచారి అమెరికా యాత్ర' విడుదల సందర్భమో లేక మరో కారణం వల్లనో తెలియదు గానీ తాజాగా ఆయన తిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్నాడు. గుడి నుంచి దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే మీడియా కెమెరాలు, ఫొటో తీయడం ఆరంభించింది. దాంతో ఆయన వడివడిగా నడుచుకుంటూ వెళ్లాడు.
మీడియా ఆయన్ను వెనకనే ఫాలో కాగా 'అలా వెనక్కు నడవడమే మీకు అలవాటైపోతోంది...' అంటూ సెటైర్ వేశాడు. మరో మీడియా వ్యక్తి ఫొటోలు తీస్తుంటే నువ్వు ఫొటోలు తీయడం లేదు.. నన్ను చూస్తున్నావు... అన్నాడు. కొందరు విలేకరులు టాలీవుడ్‌లో జరుగుతున్న పరిణామాలపై స్పందించాలని, శ్రీరెడ్డి వ్యవహారం, పవన్‌కళ్యాణ్ ఫిల్మ్‌చాంబర్‌కి వచ్చి ఆందోళన చేయడం వంటి విషయాలపై స్పందించాలని కోరగా ఆయన మాట్లాడేందుకు నిరాకరించాడు.
ఆయన ఆయా విషయాలపై స్పందించకుండా మీడియా వారిపై జోకులేస్తూ ముందుకు సాగాడు. 'ఆచారి అమెరికా యాత్ర' గురించి అడిగితే.. అవును ఈ రోజే విడుదల. గుడి లోపలంతా ఆచారులే అంటూ సమాధానం ఇచ్చాడు. ఓ విలేకరి ఓ ప్రశ్నను అడిగితే నువ్వు అడగటం నేను చెప్పడం పూర్తయ్యాయి అంటూ సెటైర్ వేశాడు. మొత్తంగా సినిమాలో తన జోక్‌లతో, సెటైర్లతో నవ్వించలేకపోయినా బ్రహ్మానందం ఇలా మీడియాతో మాత్రం పరాచికాలు ఆడి, జోకులు, సెటైర్లు బాగానే వేశాడనే సెటైర్లు పేలుతున్నాయి.