'భరత్ అనే నేను' మూవీ రిలీజ్ అయ్యి వారం రోజులు అవుతుంది. అయినా కానీ కలెక్షన్స్ విషయంలో భరత్ ఏ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకి వండర్స్ క్రియేట్ చేస్తున్నాడు. మొదటిసారిగా మహేష్ సీఎం పాత్రలో కనిపించడం.. కొరటాల స్క్రీన్ ప్లే మ్యాజిక్.. కైరా గ్లామర్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు.
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో కూడా దుమ్ము దులుపుతోంది. లేటెస్ట్ గా ఈ సినిమా కలెక్షన్స్ యూఎస్ లో 3 మిలియన్ మార్క్ ను దాటినట్టు నిర్మాత డీవీవీ దానయ్య తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. యూఎస్ లో 3 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన మహేష్ తొలి సినిమా ఇదే.
గతంలో మహేష్ నటించిన శ్రీమంతుడు అమెరికాలో 2.8 మిలియన్ డాలర్లను రాబట్టగా, దాన్ని 'భరత్ అనే నేను' అధిగమించింది. పొలిటికల్ జోనర్ తో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్ గా 161.28 కోట్లు రాబట్టిందని, తాను నిజం చెబుతున్నానని దానయ్య వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ 'రంగస్థలం' అమెరికాలో 3.5 మిలియన్ డాలర్లను వసూలు చేయగా, దాన్ని మహేష్ ఈ వారంలో అధిగమిస్తాడని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.