ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్ష సమయంలో నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మోదీ వస్తే తరిమితరిమి కొడతామని, పెళ్లాన్ని గౌరవించడం ముందు ఆయన నేర్చుకోవాలని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలాన్నే రేపాయి.
అయితే లేటెస్ట్ గా ఈ వ్యాఖ్యలపై నటుడు సాయికుమార్ స్పందించారు. బాలయ్యను చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా చెబుతున్నా.. బాలయ్య చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనని అన్నారు. సీనియర్ ఎన్టీఆర్ లాగే బాలయ్య కూడా ముక్కుసూటిగా మాట్లాడతారని, ఆయనకు ఆవేశం ఎక్కువని ఒక తెలుగువాడిగా చెబుతున్నానని ఆయన అన్నారు.
మోదీలాంటి పెద్ద వ్యక్తిని గౌరవించాల్సి ఉందని, కనీసం ఆయన పదవికైనా గౌరవం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. కానీ మనసులో ఉన్న బాధను ఇలా కాకుండా వేరే విధంగా వ్యక్తపరిచి ఉంటే బాగుండేది అని సాయి కుమార్ అన్నారు. తాను బీజేపీలో ఉన్నానని ఏపీకి ప్రత్యేక హోదా రావాలనేది తన కోరిక అని అన్నారు.