జనసేనాధిపతి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడని తేలిపోయింది. ఇక ఈయనకు వైసీపీపై మంచి అభిప్రాయం లేన్నట్లుగా నాడు కనిపించింది. ఎందుకంటే గతంలో ఆయన మాట్లాడుతూ, కోట్లు దొంగలించిన వ్యక్తికి అధికారం వస్తే సమాజానికే చేటు అని వ్యాఖ్యానించాడు. ఇక పలు చోట్ల కూడా ఆయన జగన్‌ని, ప్రతిపక్ష నేతగా ఆయన వ్యవహారశైలిని దుయ్యబట్టాడు. అయితే పవన్‌ది చెంచల మనస్తత్వం కాబట్టి ఆయన ఎప్పడు ఏ స్టాండ్ తీసుకుంటాడు? ఎప్పుడు, ఎందుకు, ఎవరిపై మండిపడతాడో తెలియదు. కానీ ఆయన తెలుగుదేశం నుంచి విడిపోయినందువల్ల తమతో కలసినా, కలవకపోయినా కూడా పవన్‌కి టిడిపి అండ లేకపోవడం తమకే మేలు చేస్తుందనే ఆశతో వైసీపీ ఉంది.
ఇక తాజాగా సినిమాలలో 30 ఇయర్స్ పృథ్వీగా పేరు తెచ్చుకున్న కమెడియన్ పృథ్వీ మాట్లాడుతూ, ఆ మధ్య ఓ కల వచ్చింది. అందులో నారదముని వారు లెగు..లెగు.. ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు యువనాయకులు కలసిపోయారు. అని నారదముని నాతో అన్నారు. అయ్యబాబోయ్ అని లేచి చూసేసరికి ఆరైంది. ఇది కల అని తేలిపోయింది. షూటింగ్‌కి టైమైందని లేచిపోయాను అని చెప్పుకొచ్చాడు. అయినా ఆ కల నిజమైతే ఎంతో బాగుంటుంది. వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌లు ఇద్దరి అజెండా ఒక్కటే. భావజాలం ఒకేలా ఉంది. సమస్యలపై పోరాడాలనేది వారి అజెండా అని చెప్పుకొచ్చాడు.
ఇక తన దృష్టిలో నిజమైన ముఖ్యమంత్రులు ఇద్దరే. ఒకరు ఎన్టీఆర్, రెండోది వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి. ఎన్టీఆర్ అత్యుత్తమ, నిజాయితీ కలిగిన ముఖ్యమంత్రి. ఇక మడమతిప్పని మహావ్యక్తి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. తెలుగువాడి వాడి వేడి చూపించిన ముఖ్యమంత్రులు వీరే. నాదృష్టిలో వీరిద్దరు మాత్రమే ది రియల్ ముఖ్యమంత్రులు అని పృథ్వీ కామెంట్ చేశాడు. బహుశా ఈయనకు కూడా వచ్చే ఎన్నికల్లో ఏమైనా పోటీ చేయాలనే ఆశ ఉందేమో అని ఆయన మాటలు వింటుంటే అనిపిస్తోంది.