అందరు దొంగలే.. దొరికితే అనేది మన రాజకీయ నాయకులు, పార్టీలకు అతికినట్లు సరిపోతుంది. నిన్నటిదాకా పవన్ వాటికి అతీతమని భావించినవారు కూడా నేడు మోదీ చేతిలో ఏమైనా పావుగా మిగిలాడా? అనిపించక మానదు. ఇక తాజాగా చంద్రబాబునాయుడు ప్రభుత్వం టిటిడి పాలకమండలిలో హిందువే గాని పుట్టా సుధాకర్ యాదవ్, టిడిపి ఎమ్మెల్యేలు వంగలపూడి అనిత, బోండా ఉమామహేశ్వరరావులను సభ్యులుగా నియమించడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. గతంలో వంగలపూడి అనిత తాను క్రిస్టియన్‌ని అని చెప్పుకుంది. బోండాకు హిందు సంప్రదాయాలే తెలియవు. దీనిపై హిందూ మత సంస్థలు తీవ్రంగా మండిపడుతుండగా, రోజా కూడా వారితో గొంతు కలిపింది. మరి ఏడు కొండల వాడికి ఏడు కొండలు అవసరమా? అని వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి అన్ననాడు.. తన పేరు వెనుక రెడ్డి తోకను అట్టే పెట్టుకుని క్రిస్టియన్‌గా చలామణి అవుతున్న జగన్‌మోహన్ రెడ్డి అన్యమతస్తులు అనుమతితోనే తిరుమలలో దైవదర్శనం చేసుకోవాలనే నిబంధనలను పక్కన పెట్టినప్పుడు, చెప్పులతో నడిచినప్పుడు ఈ విమర్శలు చేసే వారందరు ఏమైపోయారు? అనేదే ప్రశ్న.
ఇక తాజాగా రోజా కూడా పవన్‌కి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. కాస్టింగ్‌కౌచ్ విషయంలో పవన్‌నే ఎందుకు లాగారు? సీనియర్ స్టార్, నందమూరి వారసుడు, ఎమ్మెల్యే అయిన బాలకృష్ణని ఎందుకు లాగలేదు? అని రోజా ప్రశ్నించింది. ఈ క్రమం చూస్తుంటే చంద్రబాబు పవన్‌ని టార్గెట్ చేశాడని అనిపిస్తోందని, స్వలాభం కోసం పవన్‌పై వ్యక్తిగత దూషణలు.. తమ పబ్లిసిటీ కోసం పవన్‌ని బద్‌నాం చేస్తే చూస్తూ ఊరుకోమని తెలిపింది. రాజకీయంగా పవన్‌కి, మాకు పడకపోయినా, వ్యక్తిగతంగా మాత్రం తాము పవన్‌కి మద్దతు ఇస్తున్నామని ఆమె తెలిపింది. ఇక ప్రతిపక్ష నేత జగన్‌కి పవన్ అంటే చాలా కోపం. పవన్ లేకుండా ఉండి ఉంటే 2014లోనే తాను ముఖ్యమంత్రిని అయ్యేవాడినని, కానీ పవన్ ఎంటరై, కాపుల ఓట్లు చంద్రబాబుకి పడేలా చేయడంవల్ల తాను గెలవలేకపోయానని జగన్ భావన. మొత్తంగా ఇప్పుడు పవన్‌కి, చంద్రబాబుకి చెడటంతో జగన్, ఆయన మీడియా పవన్ మీద కాస్త అనుకూల వైఖరి చూపుతున్నారు.
ఇక పాదయాత్ర డైరీ పేరుతో జగన్ రాస్తున్నట్లుగా సాక్షిలో వస్తున్న కాలంలో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. 'ఢిల్లీకి రాజైనా అమ్మకి కొడుకే' అన్నారు మనపెద్దలు. సృష్టి అంతటిలో అమ్మే తొలి దైవం, గురువు అని వారు చెప్పారు. అందుకే మాతృదేవోభవ అంటారు. అమ్మస్థానం అంత ఉన్నతమైనది. కొద్దిరోజులుగా అమ్మస్థానాన్ని దిగజార్చేలా.. అవమాన పరిచేలా రాజకీయాలు సాగుతుండటం బాధాకరం. అత్యంత దారుణం, పాపం...మహాపాపం. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. గత 141రోజులుగా నేను చేస్తున్న పాదయాత్రలో ఎందరో తల్లులు నన్ను తమ బిడ్డలా చూసుకున్నారు. వారి ఆప్యాయత, అనురాగాలు అనిర్వచనీయం. అందుకే మాది ఎప్పుడు ఒకటే సిద్దాంతం. అమ్మ ఎవరికైనా అమ్మే. అమ్మకు నా వందనం అని జగన్ స్పందించడం చూస్తే అసలు విషయం అర్ధమవుతోంది.